కలం, వరంగల్: వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను ఆదివారం లోగా పూర్తి చేయాలని వరంగల్ బల్దియా కమిషనర్ టీ. వెంకన్న (GWMC Commissioner Venkanna) అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని మడికొండ, బంధం, సిద్ధేశ్వర గుండం, ఉర్సుగుట్ట, బేస్తం, అగర్తల, కట్టమల్లన్న, చిన్నవడ్డేపల్లి, ముచ్చర్ల, హసన్పర్తి, భీమారం చెరువుల నిమజ్జన కేంద్రాలను ఆయన పరిశీలించారు.
నిమజ్జన కేంద్రాల్లో గుర్రపు డెక్క తొలగింపు, పూడికతీత, పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని వెంకన్న (GWMC Commissioner) సూచించారు. క్రేన్లకు ఇంధనం, అవసరమైన సిబ్బందిని ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. తెప్పలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు అత్యవసర వైద్య సేవల కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.
ఇంజనీరింగ్, ఆర్అండ్బీ, డీఆర్ఎఫ్, మైనింగ్, మత్స్య తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, వెలుతురు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించాలని, రద్దీ-వాహనాల రాకపోకలు, భద్రతను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని కమిషనర్ వెంకన్న స్పష్టం చేశారు.

