కలం, జగిత్యాల: తెలంగాణలో మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) అన్నారు. శనివారం జగిత్యాల (Jagtial) రూరల్ మండలం వంజరిపల్లి గ్రామంలో రూ. 10 లక్షల నిధులతో నిర్మించనున్న శ్రీ లక్ష్మీపార్వతి మహిళా సమాఖ్య భవనానికి ఆయన భూమిపూజ చేసి, శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ప్రజల రక్షణ కోసం నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి, ఆర్థిక సమృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగేలా అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజల భద్రతకు కూడా సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఉప సర్పంచ్ తిరుపతికి ఎమ్మెల్యే పరామర్శ
అనంతరం, ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ తిరుపతిని ఎమ్మెల్యే నేరుగా వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తి కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, సర్పంచ్ గంగమల్లయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, ప్రజాప్రతినిధులు నక్కల రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాల ముకుందం, ఎంఆర్ఓ హకీమ్, ఎస్సై ఉమాసాగర్, ఎంపీవో రవిబాబు, ఏఈ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

