కలం, నిర్మల్: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంలా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) అన్నారు. శనివారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో నిర్మల్ నియోజకవర్గానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.14 లక్షల 38 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల (CMRF) ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూనే, పేదలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అవసరమైన సమయంలో అర్హులైన బాధితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు భీంరెడ్డి, అబ్దుల్ హదిల్, శ్రీ గండి రామన్న దత్త సాయి ఆలయ చైర్మన్ కొట్టే శేఖర్, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

