వరంగల్ రెవెన్యూ రూటు.. సపరేటు!

కలం, వరంగల్ బ్యూరో: రెవెన్యూ కార్యాలయాల్లో (Warangal Revenue Offices) ఫైలు కదలాలంటే ప్రతి పనికి ఓ ‘రేటు’ నడుస్తోంది. ఇప్పుడిదే ఉమ్మడి వరంగల్‌లో చర్చనీయాంశంగా మారింది. పౌతి మార్పిడులు, నాలా కన్వర్షన్లు, భూ రికార్డుల సవరణలు వంటి పనుల్లో కొందరు తహసీల్దార్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతుండగా.. సిబ్బంది, మధ్యవర్తుల ద్వారా దందాను నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా గోవిందరావుపేట తహసీల్దార్ రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం ఆరోపణలకు మరింత బలాన్నిఇచ్చాయి.

భూముల విలువ పెరగడమే కారణం

వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌, నగర విస్తరణ, రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలతో వరంగల్‌ శివారు ప్రాంతాల్లో భూములకు డిమాండ్‌ పెరిగింది. ఎల్కతుర్తి, హసన్‌పర్తి, ధర్మసాగర్‌, మడికొండ, కాజీపేట, గీసుగొండ, ఖిలా వరంగల్, వర్ధన్నపేట తదితర మండలాల్లో భూ లావాదేవీలు ఎక్కువగా జరుగుతుండడంతో రెవెన్యూ వ్యవహారాలు కీలకంగా మారాయి.

భూ రికార్డులు, పౌతి మార్పిడులు, నాలా కన్వర్షన్లు, ప్రభుత్వ, సీలింగ్‌ భూముల్లోనూ కొందరు అధికారులు, సిబ్బంది అక్రమార్కులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ఫైళ్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అలాంటివారిపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం.

పెండింగ్ పెట్టి.. ఆఫీసు చుట్టూ..

తహసీల్దార్ కార్యాలయాల్లో పనికో రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారు. దరఖాస్తు దారుల ఫైళ్లను పెండింగ్‌లో ఉంచి రోజులు, నెలలు చుట్టూ తిప్పించుకుంటారు. నగర శివార్లలోని కొందరు తహసీల్దార్లపై ల్యాండ్‌ సెక్షన్‌, నాలా కన్వర్షన్లు, పౌతి మార్పిడులు, రికార్డుల సవరణలకు సంబంధించి ఫిర్యాదులు ఉన్నాయి. తహసీల్దార్ల సహకారంతో రియల్టర్లు భూ రికార్డులు, హక్కులు, విస్తీర్ణంపై పూర్తి స్పష్టత లేకుండానే వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఫైళ్లు పరిశీలిస్తేనే వాస్తవాలు

భూ లావాదేవీలు అధికంగా జరిగే మండలాల్లో కొంతకాలంగా జరిగిన పౌతి మార్పిడులు, నాలా కన్వర్షన్లు, రికార్డుల సవరణలు, సీలింగ్‌, ప్రభుత్వ భూములకు సంబంధించిన ఫైళ్లను సమగ్రంగా పరిశీలిస్తే ఆరోపణల్లో వాస్తవమెంతనేది తేలే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి నివేదికలు, పాత రికార్డులు, ఫైళ్లలో జరిగిన మార్పులను సరిపోల్చితే నిబంధనల ఉల్లంఘనలు జరిగాయా..! లేదా అనేది గుర్తించవచ్చని పలువురు బాధితులు పేర్కొంటున్నారు.

గోవిందరావుపేట తహసీల్దార్ లంచం కేసుతో మరోసారి రెవెన్యూ ఆఫీసులపై దృష్టి పడింది. భూ వ్యవహారాల్లో మధ్యవర్తుల పాత్ర, ఫైళ్ల పెండింగ్‌, అధికారుల నిర్ణయాలపై ఉన్నతాధికారులు సమగ్రంగా సమీక్షిస్తే ఆరోపణల వెనుక వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని ప్రజలు పేర్కొంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>