దానంకు మరోసారి అగ్నిపరీక్ష.. ఖైరతాబాద్‌ బైపోల్‌లో పోటీపై ఉత్కంఠ!

కలం, తెలంగాణ బ్యూరో: పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. స్పీకర్‌ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు.. దానం (Danam Nagender) శాసనసభ సభ్యత్వం రద్దయినట్లు ప్రకటించింది. దీంతో ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ పరిణామం దానం రాజకీయ ప్రస్థానానికి మరో పరీక్ష కానుంది. తాను సుప్రీంకోర్టుకు వెళ్లబోనని, ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక వస్తే పోటీకి సిద్ధంగా ఉన్నానని దానం ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. అయితే, ఆయనకు న్యాయపరంగా పోటీ చేసే అవకాశం ఏ మేరకు ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఖైరతాబాద్‌లో సుదీర్ఘ అనుబంధం

గ్రేటర్‌ హైదరాబాద్‌ రాజకీయాల్లో దానం నాగేందర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. పీజేఆర్‌ శిష్యుడిగా ఎదిగిన ఆయన తొలుత ఆసిఫ్ నగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డికి దగ్గరయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఆసిఫ్ నగర్‌ నియోజకవర్గం స్థానంలో నాంపల్లి ఏర్పడింది. దీంతో ఆయన రాజకీయ గురువు పీజేఆర్‌ కంచుకోటగా చెప్పుకునే ఖైరతాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌కు ఓటమి ఎదురైంది. 2018లో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. అదే ఖైరతాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి వరుసగా రెండోసారి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే 2009, 2018, 2023లో ఖైరతాబాద్‌ నుంచి విజయం సాధించిన దానం.. ఇప్పుడు మరోసారి అదే నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ చేయాలని భావిస్తున్నారు.

పార్టీ మార్పుతో మొదలై.. అనర్హత వరకు

2023లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై ఖైరతాబాద్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్‌.. 2024 మార్చిలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేశారు. అయితే, బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతూనే.. మరో పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆయనపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. స్పీకర్‌ ఆ పిటిషన్లను తిరస్కరించగా.. ఆ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు స్పీకర్‌ ఉత్తర్వులను పక్కనపెట్టి దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించింది.

న్యాయపరంగా ఏ మేరకు అవకాశం?

హైకోర్టు అనర్హత వేటు నేపథ్యంలో.. దానం నాగేందర్‌ మళ్లీ ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేయగలరా? అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. తాను ఉప ఎన్నికకు సిద్ధమని దానం ప్రకటించినప్పటికీ.. ఆయనకు ఉన్న న్యాయపరమైన అవకాశాలు, ఎన్నికల నిబంధనలు ఎలా వర్తిస్తాయన్నది స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు దానం పోటీకి అర్హత లేకపోతే.. కాంగ్రెస్‌ ఖైరతాబాద్‌లో మరో అభ్యర్థిని బరిలోకి దించాల్సిన పరిస్థితి వస్తుందా? అన్న చర్చ కూడా మొదలైంది. దీంతో దానం పోటీపై కాంగ్రెస్‌ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

దానంకు ఇది కొత్తేమీ కాదు

అయితే దానం నాగేందర్‌ రాజకీయ ప్రస్థానంలో పార్టీ మార్పుల కారణంగా ఎన్నికలను ఎదుర్కొన్న సందర్భం గతంలోనూ ఉంది. ఒక దశలో టీడీపీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి మారడంతో ఉప ఎన్నికను ఎదుర్కొన్న దానం.. ఇప్పుడు పార్టీ ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యే పదవి కోల్పోయి, మరోసారి ఎన్నికల బరిలోకి దిగే పరిస్థితి ఏర్పడింది. బీఆర్‌ఎస్‌, బీజేపీ తదితర పార్టీలు కూడా ఖైరతాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఉప ఎన్నిక తేదీ, అభ్యర్థుల ఎంపిక, పార్టీలు అనుసరించే వ్యూహాలపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. ప్రస్తుతానికి హైకోర్టు తీర్పుతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ కావడం, దానం నాగేందర్‌ మళ్లీ పోటీకి సిద్ధమని ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>