ఆసియా గేమ్స్‌లో అర్ధరాత్రి గందరగోళం!

కలం, స్పోర్ట్స్: నాగోయాలో ఆసియా గేమ్స్‌కు వెళ్లిన భారత బృందానికి మరో షాకింగ్ అనుభవం ఎదురైంది. జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ (Pranati Nayak), ఆమె కోచ్ అశోక్ మిశ్రాకు క్రూయిజ్ షిప్‌లో ఒకే గదిని కేటాయించారు. దీంతో అర్ధరాత్రి వరకు గందరగోళం కొనసాగింది. ప్రణతి, అశోక్ ఈ విషయాన్ని వెంటనే నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. నిర్వాహకులు, టీమ్ అధికారులను సంప్రదించినా సమస్య వెంటనే పరిష్కారం కాలేదు. చివరకు భారత ఒలింపిక్ అసోసియేషన్ జోక్యం చేసుకుంది. రాత్రి సుమారు 1.30 గంటలకు ఇద్దరికీ వేర్వేరు గదులు కేటాయించారు.

అశోక్ మిశ్రాకు మరో సమస్య ఎదురైంది. కొత్త గది తాళాలు తీసుకునేందుకు వెళ్లగా, రిజిస్టర్‌లో ఆయన బుకింగ్ కనిపించలేదు. తర్వాత అసలు కారణం బయటపడింది. అధికారిక రికార్డుల్లో ఆయన పేరులో ‘I’ అనే అక్షరం లేకపోవడంతో ఈ సమస్య వచ్చినట్లు గుర్తించారు. పేరు, అక్రిడిటేషన్ వివరాలను సరిచేయడానికి మరో 45 నిమిషాలు పట్టింది. దీంతో అశోక్‌కు రాత్రి 2 గంటలు దాటిన తర్వాతే గదిలోకి వెళ్లే అవకాశం వచ్చింది.

ఈ ఘటనపై జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ స్పందిస్తూ.. వసతి విషయంలో గందరగోళం జరిగిందని, అది రాత్రి 2 గంటల సమయంలో పరిష్కారమైందని తెలిపారు. భారత బృందం జపాన్ చేరినప్పటి నుంచి వసతికి సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు క్రీడాకారులు గదుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఇప్పటికే భారత కబడ్డీ బృందానికి కూడా గదుల కేటాయింపు, చెక్-ఇన్ విషయంలో ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం. క్రీడలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ వసతి, నిర్వహణ సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని భారత క్రీడాకారులు, సహాయక సిబ్బంది ఆశిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>