కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ ప్రాజెక్టును కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావుపై (Harish Rao) కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హరీశ్ రావు ఫామ్‌హౌస్ కట్టుకోవడం కోసం అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
భూసేకరణ పూర్తయిన తర్వాత ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను మార్చారని పేర్కొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని సుడా (SUDA) పార్కుకు కేటాయించి, దాని పక్కనే ఉన్న స్థలంలో ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారని విమర్శించారు. ప్రాజెక్టుకు దగ్గరగా విలువైన 2 ఎకరాల భూమిని కేవలం 4 లక్షల రూపాయలకే హరీశ్ రావు కొనుగోలు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. 2004 ఎన్నికల అఫిడవిట్లో హరీశ్ రావు చూపించిన ఆస్తులు ఎంత? ఇప్పుడు ఆయన వద్ద ఉన్న ఆస్తుల విలువ ఎంత? అనే విషయాలను స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఈడీ విచారణ జరిపించాలి: అద్దంకి దయాకర్
రంగనాయకసాగర్ పరిసర ప్రాంతాల్లో హరీశ్ రావు భారీగా భూ దందాలకు పాల్పడ్డారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఆరోపించారు. వ్యవసాయ భూముల్లో అక్రమాలకు పాల్పడటమే కాకుండా, బంధుప్రీతితో అసైన్డ్ భూములను తన మామకు అప్పగించారని విమర్శించారు. రాజీవ్ రహదారికి సమీపంలో రైతులను బెదిరించి భూములు లాక్కున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. హరీశ్ రావు చేసిన అక్రమాలు, భూ దందాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేత సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

