కలం, కరీంనగర్ బ్యూరో: దానం నాగేందర్ (Danam Nagender)పై హైకోర్టు అనర్హత వేటు ప్రజాస్వామ్య విజయమని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) స్పష్టం చేశారు. శాసన వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకున్న కాంగ్రెస్ కు ఇది చెంప పెట్టు అని పేర్కొన్నారు. శాసన వ్యవస్థ విచక్షణాధికారంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పీకర్ తలొగ్గడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే నేడు ఈ పరిస్థితి తలెత్తేది కాదని అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం క్షమించరాని నేరమన్నారు.
అది కూడా అంతే తప్పు..
పట్టపగలు దేశమంతా చూస్తుండగా హత్య చేసిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించడం ఎంత తప్పో… ఒక పార్టీ నుండి గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుండి పోటీ చేసినా అనర్హత వేటు వేయకపోవడం అంతే తప్పు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ/శాసన వ్యవస్థే అత్యున్నతమైనదని, ఆ వ్యవస్థే పక్షపాతంగా వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అనివార్యంగా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని సరిదిద్దుతుంద నడానికి ఇదే నిదర్శనం అన్నారు.
రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై సోయి ఉందా?
కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థలనే ధ్వంసం చేసేందుకు వెనుకాడటం లేదనేది తేటతెల్లమైందని చెప్పారు. రాజ్యాంగ బుక్ ను పట్టుకుని షో చేసినంత మాత్రాన రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షకుడు కాలేరు అని పేర్కొన్నారు. రాజ్యాంగం ఏం చెబుతుందో దానిని అనుసరించాలనే సోయి కాంగ్రెస్ నాయకులకు ఉండాలని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీకర్ పై ఒత్తిడి తెచ్చి శాసనసభ పరువు తీస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రశ్నించారు.
వారిపై తక్షణమే అనర్హత వేటు వేయాలి..
ఇకనైనా స్పీకర్ రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలందరినీ వెంటనే అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శాసనసభ వ్యవస్థను, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రజాస్వామ్యవాదులంతా ముందుకు రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

