కలం, ముథోల్: ముథోల్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన 28 ప్యాకేజీ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) అన్నారు. ప్రాజెక్టు పనుల పూర్తికి రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ముథోల్ నియోజకవర్గ రైతులు పెద్దఎత్తున భూములను కోల్పోయారని తెలిపారు. రైతుల త్యాగాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఇప్పటికే రూ.80 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేసినప్పటికీ, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ సరఫరా ఏర్పాట్ల కోసం మరో రూ.2.20 కోట్ల నిధులు అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిధులను తక్షణమే విడుదల చేస్తే సుమారు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 28 ప్యాకేజీ పనుల పూర్తికి రూ.500 కోట్లు, పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్కు అవసరమైన రూ.2.20 కోట్లను వెంటనే మంజూరు చేయాలని పవార్ రామారావు పటేల్ ప్రభుత్వాన్ని కోరారు.

