కలం, నిర్మల్ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం.97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. తరగతులను బహిష్కరించిన విద్యార్థులు కళాశాల ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శక్తి స్కీం, జీవో నం.97ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలని నినాదాలు చేశారు.
పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల మూడేళ్ల సాంకేతిక విద్యా విధానంపై ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల భవిష్యత్తులో వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రస్తుత విధానంలోనే కొనసాగించాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని శక్తి స్కీం, జీవో నం.97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన తరహా ఉద్యమ పరిస్థితులు తెలంగాణలో పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని విద్యార్థులు కోరారు.

