కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు (Ambati Rambabu)ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈడీ అధికారులు ఫోన్ ద్వారా ఆయనకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఫోన్ ద్వారా అంబటి రాంబాబుకు సమాచారం అందించింది. సెప్టెంబర్ 11వ తేదీన విచారణ కోసం తమ కార్యాలయానికి రావాలని అంబటి రాంబాబుకు ఈడీ అధికారులు నోటీసుల్లో తెలియజేశారు.
అయితే ఈ నోటీసులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
ఏ కేసులో నోటీసులో తెలియదన్న అంబటి
ఇక, ఈడీ నుంచి తనకు నోటీసులు (ED Notice) వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంపై అంబటి రాంబాబు స్పందించారు. అసలు ఏ కేసుకు సంబంధించి అధికారులు తనను విచారణకు పిలిచారో తనకు తెలియదని ఆయన తెలిపారు. ఈడీ నుంచి తనకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపణ
తనపై మరో కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంబటి రాంబాబు ఆరోపించారు. తనను రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అయితే ఆయన చేసిన ఆరోపణలపై ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.

