కలం, వనపర్తి: వనపర్తి మండలంలోని వెల్టూరు (Veltoor) గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రూ. 11.75 కోట్ల అంచనా వ్యయంతో సెమీ రెసిడెన్షియల్ విధానంలో అత్యాధునిక పాఠశాలను నిర్మించనున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే (Wanaparthy MLA) తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) తెలిపారు. శుక్రవారం ఆయన వెల్టూరులో పాఠశాల నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించారు.
విద్యార్థులకు మెరుగైన విద్యా ప్రమాణాలు
ఈ సందర్భంగా అధికారులతో పాఠశాల నిర్మాణానికి సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యే చర్చించారు. విద్యార్థులకు అనుకూలంగా ఉండేందుకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర సౌకర్యాల కల్పనపై సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఆధునిక బోధనా పద్ధతులు, క్రీడలు, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం అందించడమే టీపీఎస్ల లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యా ప్రమాణాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
విద్యార్థులు పాఠశాలకు సులభంగా చేరుకునేందుకు ప్రత్యేక బస్సుల ద్వారా రవాణా సౌకర్యం కల్పించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ విదేశాల్లోని విద్యా విధానాలు, బోధనా పద్ధతులను అధ్యయనం చేసే అవకాశాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడంతోపాటు ఒక్కో విద్యార్థికి సుమారు రూ.1,400 విలువైన కిట్ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
నాణ్యమైన బోధన, ఆధునిక మౌలిక వసతులు, రవాణా, విద్యా సామగ్రి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలతో సమగ్ర విద్య అందించడమే టీపీఎస్ల ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం విద్యార్థులతో ఎమ్మెల్యే ముచ్చటించి, వారితో సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

