కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాంపల్లి ఏసీబీ కోర్టులో ఫార్ములా-ఈ రేస్ కేసు విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల విలువైన భూములను కొల్లగొట్టిందంటూ రేవంత్ రెడ్డి అనుకూల మీడియాలో వస్తున్న వార్తలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే వాళ్లు చెప్తున్న ఆ లక్ష కోట్లలో తమకు ఒక వెయ్యి కోట్లు ఇచ్చి, మిగతా 99 వేల కోట్లు వారే తీసేసుకోని.. ఆ డబ్బుతోనైనా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డికి బంపరాఫర్ ఇచ్చారు.
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్లు తిన్నారని, ప్రగతి భవన్‌లో 150 గదులు ఉన్నాయని అబద్ధపు ప్రచారం చేసినట్లే, ఇప్పుడు భూముల విషయంలోనూ విషప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 22A నిబంధనల పేరిట 30% కమిషన్ల దోపిడీ జరుగుతోందని, ఈ విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైందని ఆరోపించారు. ఈ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే సీఎం రేవంత్ రెడ్డి ఇటువంటి చిల్లర ప్రయత్నాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. “తవ్వుకోండి.. కేసులు పెట్టుకోండి.. ఎన్ని కమిషన్లైనా వేసుకోండి.. రేవంత్ రెడ్డి ఏం చేయలేరు. ఏమీ చేతకాదని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది” అంటూ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై కేటీఆర్ ప్రశ్నలు
కేసీఆర్‌కు 1,000 ఎకరాల ఫామ్‌హౌస్ (KCR Farmhouse) ఉందంటూ గతంలో రేవంత్ రెడ్డి ప్రచారం చేశారని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. అయితే అసెంబ్లీలో కేసీఆర్‌కు ఉన్న భూమి 67 ఎకరాలు మాత్రమేనని సీఎం స్వయంగా చెప్పారని ఆయన అన్నారు. మరి మిగతా 933 ఎకరాలు ఏమి అయ్యాయి రేవంత్ రెడ్డి? అంటూ కేటీఆర్ ఘాటుగా ప్రశ్నించారు. ఇన్ని రోజులు చేసిన ఆరోపణలకు రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫార్ములా-ఈ కేసు విచారణ వాయిదా
మరోవైపు ఫార్ములా-ఈ రేస్ కేసు తదుపరి విచారణను నాంపల్లి ఏసీబీ కోర్టు అక్టోబర్ 30కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే ఫార్ములా-ఈ రేస్ కేసుపై కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కోసం తాము ఫార్ములా ఈ రేసును హైదరాబాద్ కు తీసుకొచ్చామని తెలిపారు. ఇటీవల తమిళనాడు సీఎం విజయ్ మోటార్ రేస్ కోసం లండన్ వెళ్లారని గుర్తు చేశారు. తాను హైదరాబాద్ ఖ్యాతిని పెంచడానికి, పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఇక్కడికే ఫార్ములా-ఈ తెచ్చి ఈవెంట్ నిర్వహిస్తే.. అందులో ఏదో జరిగిందని అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు.
Also Read : సిద్దిపేటకు రావడానికి అంత భయమెందుకు?: హరీశ్ రావు
Follow Us On: X(Twitter)

