కేంద్రమంత్రితో సీఎం రేవంత్ భేటీ.. పలు కీలక ప్రతిపాదనలు

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో భాగంగా ప్రధాని ఆవాస్ యోజన – గ్రామీణ్ (PMAY-G) పథకం కింద మొదటి విడతలో తెలంగాణకు 2 లక్షల ఇండ్లను కేటాయించినందుకు కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర డిమాండ్ కు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కూడా వీలైనంత త్వరగా కేటాయించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

అదేవిధంగా రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, దీని కారణముగా వ్యవసాయ రంగానికి విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకువెళ్లారు. వర్షాభావం తీవ్రంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో తాగునీరు, విద్యుత్ కొరత ఏర్పడకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తోందని వివరించారు. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సన్నబియ్యాన్ని అందిస్తున్నామని కేంద్రమంత్రికి సీఎం తెలిపారు. రైతులకు మద్దతుగా సన్న వడ్ల సాగుకు రూ.500 బోనస్ అందించి ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా రైతులను ప్రత్యామ్నాయ పంటలు, పంట మార్పిడి వైపు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఈ ప్రయత్నాలకు కేంద్రం మద్దతుగా నిలవాలని కోరారు. అంతేకాకుండా, రాష్ట్రంలో రైతు ప్రయోజనాల కోసం 250 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫ్రూట్స్ , అలాగే వెజిటెబుల్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>