కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని (Erravalli) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ (KCR Farmhouse) శివారు భూములలో రెవెన్యూ, సర్వే అధికారులు వరుసగా రెండో రోజు క్షేత్రస్థాయి విచారణ, సర్వే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, ఏడీ సుదర్శన్, మర్కుక్ ఎమ్మార్వో నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నిన్న తొలిరోజు ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్, వరదరాజ్ పూర్ గ్రామాల సరిహద్దుల పరిధిలోని భూములను అధికారులు పరిశీలించి ప్రాథమిక మార్కింగ్ పూర్తి చేశారు.
వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న 325 సర్వే నంబర్లోని 388 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూములపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ రోజు 325 సర్వే నంబర్ పరిధిలో అసలు ఎంత విస్తీర్ణంలో భూమి ఉందో ఖచ్చితంగా తేల్చేందుకు ఆధునిక శాటిలైట్ సర్వే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఈ సర్వే ద్వారా ప్రభుత్వ భూములు ఎంతమేర ఉన్నాయి, అందులో పట్టా భూములు ఎంత, ఆక్రమణలకు గురైన విస్తీర్ణం ఎంత అనే వివరాలపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

