కలం, నేషనల్ డెస్క్ : టాటా గ్రూప్ మాతృ సంస్థ (హోల్డింగ్ కంపెనీ) ‘టాటా సన్స్’ (Tata Sons)లో గురువారం హైడ్రామా నడిచింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ (63) పదవీకాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్నది. కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని నిర్ణయించింది.
అయితే, టాటా సన్స్‌లో దాదాపు 66 శాతం ఈక్విటీ వాటా ఉన్న ప్రధాన భాగస్వామి ‘టాటా ట్రస్ట్స్’ ఛైర్మన్ నోయల్ టాటా ఈ నిర్ణయాలను తప్పుపట్టారు. ఈ తీర్మానం పూర్తిగా చట్టవిరుద్ధమని ప్రకటించారు. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేయడంతో గ్రూప్‌లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి.
చంద్రశేఖరన్ యూటర్న్
చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనుంది. తాను మళ్లీ ఛైర్మన్‌గా కొనసాగే ప్రసక్తే లేదని ఆయన గత ఆగస్టు 12న బోర్డుకు లేఖ రాశారు. టాటా ట్రస్ట్స్ కూడా దీనిని ఆమోదించి, కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం ‘సెలెక్షన్ కమిటీ’ని ఏర్పాటు చేయాలని టాటా సన్స్‌కు సూచించింది. అయితే, గురువారం జరిగిన బోర్డు సమావేశంలో పరిస్థితి మారింది. గ్రూప్ ప్రయోజనాల దృష్ట్యా మరోసారి బాధ్యతలు స్వీకరించాలని బోర్డు కోరడంతో చంద్రశేఖరన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అనంతరం జరిగిన ఓటింగ్‌లో నలుగురు డైరెక్టర్లు ఆయన కొనసాగింపునకు అనుకూలంగా ఓటు వేయగా.. టాటా ట్రస్ట్స్ నామినీ డైరెక్టర్ హోదాలో నోయల్ టాటా ఒక్కరే దీనిని వ్యతిరేకించారు.
తీర్మానం చెల్లదు: టాటా ట్రస్ట్స్
టాటా సన్స్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చంద్రశేఖరన్ పునర్నియామక తీర్మానం చట్టబద్ధంగా చెల్లదని స్పష్టం చేసింది. టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఏవోఏ)లోని నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ట్రస్ట్స్ వాదిస్తున్నది. ఈ పునర్నియామకానికి చట్టబద్ధత లేదని పేర్కొన్నది. అంతేకాకుండా, చంద్రశేఖరన్ ఇప్పటికే పదవీకాలం ముగిసిన తర్వాత కొనసాగబోనని ఇచ్చిన హామీని గౌరవించాలని, కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం సెలెక్షన్ కమిటీ ప్రక్రియను కొనసాగించాలని కోరుతున్నది.
అసలు చిచ్చు ఇక్కడే..!
టాటా గ్రూప్‌లో విభేదాలకు చంద్రశేఖరన్ నియామకంతో పాటు టాటా సన్స్ లిస్టింగ్ వ్యవహారమే ప్రధాన కారణం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం టాటా సన్స్ సంస్థ ‘అప్పర్ లేయర్’ కేటగిరీ కిందకు వస్తుంది. కాబట్టి కంపెనీని స్టాక్ మార్కెట్లో తప్పనిసరిగా లిస్టింగ్ చేయాల్సి ఉంది. అయితే, గ్రూప్ హోల్డింగ్ కంపెనీని పబ్లిక్ లిస్టింగ్ చేయడం టాటా ట్రస్ట్స్‌కు ఇష్టం లేదు.
దీనిని ప్రైవేట్ సంస్థగానే ఉంచాలని కోరుకుంటున్నది. కాగా, టాటా సన్స్‌లో 18.37 శాతం వాటా ఉన్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మాత్రం నిధుల లభ్యత కోసం లిస్టింగ్‌ను గట్టిగా సమర్థిస్తున్నది. ఆర్బీఐ మినహాయింపు ఇవ్వకపోవడం, బోర్డు లిస్టింగ్ వైపు మొగ్గు చూపడం కూడా నోయల్ టాటా ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తున్నది.
ఎయిర్ ఇండియా, బిగ్ బాస్కెట్ వంటి నష్టాల్లో ఉన్న కొత్త వ్యాపారాలకు చంద్రశేఖరన్ హయాంలో భారీగా మూలధన నిధులు కేటాయించడంపై కూడా టాటా ట్రస్ట్స్ అసంతృప్తితో ఉన్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటా సామ్రాజ్యంలో లీడర్షిప్, గవర్నెన్స్ పరంగా తలెత్తిన ఈ సంక్షోభం రానున్న రోజుల్లో న్యాయస్థానాలకు చేరే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు, స్టాక్ మార్కెట్ నిపుణులు ఉత్కంఠతో గమనిస్తున్నారు.

