ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు వెనుక పెద్ద కుట్ర?

కలం, తెలంగాణ బ్యూరో: అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ అమలుకు ముందే భూకబ్జాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టాన్ని (Land Grabbing Act) రద్దు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ తర్వాత ధరణి వ్యవస్థకు సంబంధించిన చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. అసెంబ్లీలో ధరణి, ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం రద్దుపై సీఎం బుధవారం మాట్లాడారు.

చట్టం రద్దు నుంచి ధరణి అమలు వరకు తీసుకున్న నిర్ణయాలన్నీ పథకం ప్రకారమే జరిగాయన్నారు. “ఈ చట్టం తొలగించి ప్రజలకు గుండు చేసిండు. అందుకే అసెంబ్లీకి వచ్చేందుకు ఆయనకు గుండెలు లేవు” అని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే క్రిమినల్‌ కేసులు పెట్టి శిక్షించేలా 1982లో తీసుకొచ్చిన ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం కబ్జాదారులకు అంకుశంలా ఉండేదని అన్నారు.

అలాంటి చట్టాన్ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. చట్టం రద్దు వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. 2016లో ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం రద్దు.. 2018లో ధరణి ప్రాజెక్టుకు టెండర్లు.. 2020లో పనులు ప్రారంభం.. 2023 నాటికి ధరణి వ్యవస్థతో ప్రజలకు నష్టం జరిగిందని సీఎం వివరించారు.

పేద రైతులకు నష్టం

భూములపై హక్కులు, రికార్డుల సవరణ, వారసత్వం, పట్టాదారు పాస్‌బుక్‌లకు సంబంధించిన సమస్యలతో పేద రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం అన్నారు. భూ వివాదాల్లో న్యాయం పొందేందుకు ఉన్న మార్గాలను బలహీనపరిచేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. భూ రికార్డుల డిజిటలైజేషన్‌ పేరుతో తీసుకున్న నిర్ణయాల వల్ల వాస్తవ భూ యజమానులు, వారసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న భూ విధానాలపై సమీక్ష అవసరమని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>