బీఆర్‌ఎస్‌ భూకబ్జాలపై పోరాటం చేస్తాం: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ (BRS) దోచుకున్న భూములపై బీజేపీ(BJP) ఆధ్వర్యంలో దండ యాత్ర చేస్తామని ప్రకటించారు. ఆ భూముల్లో కాషాయ జెండా ఎగరేసి పేదలకు పంచి పెడతామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ భూ వ్యవహారాలను సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు. బుధవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, నగర మేయర్, డిప్యూటీ మేయర్‌లతో కలిసి మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లి ప్రాంతాల్లో బండి సంజయ్ పర్యటించారు. గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జనోత్సవాలకు వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు.

నిమజ్జనానికి రూ.1.5 కోట్ల కేటాయింపు

కరీంనగర్‌లో గణేశ్ నిమజ్జనోత్సవాల కోసం రూ.1.5 కోట్లు కేటాయించినట్లు బండి సంజయ్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే మూడింతలు అధికంగా నిధులు కేటాయించామని చెప్పారు. నిమజ్జనానికి అవసరమైన క్రేన్లను అందుబాటులో ఉంచడంతో పాటు భారీ లైటింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. నిమజ్జనానికి మూడు రోజుల ముందుగానే అవసరమైన నీటిని విడుదల చేయాలని అధికారులను కోరారు. నిమజ్జన మార్గాల్లో ప్యాచ్‌వర్క్ పనులు పూర్తయ్యాయని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ భూములపై సంచలన ఆరోపణలు

తెలంగాణలో అనేక కుటుంబాలకు సొంత భూమి, ఇల్లు లేదని, మరోవైపు బీఆర్‌ఎస్‌ నేతలు వేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల భూ వ్యవహారాలపై అసెంబ్లీలో చర్చించడానికి గంట సమయం పట్టిందని, మిగతా ఎమ్మెల్యేల వ్యవహారాలపై చర్చించేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. భూ వ్యవహారాలపై విచారణ పేరుతో జాప్యం చేయకుండా జిల్లాల కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తే 24 గంటల్లో నివేదిక ఇవ్వగలరని అన్నారు. గతంలో విద్యుత్ కొనుగోళ్లు, ఈ-ఫార్ములా రేసు, కాళేశ్వరం, గొర్రెల పథకం తదితర అంశాలపై చేపట్టిన విచారణల పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు.

ఫారెస్ట్ భూములపై చర్యలు తీసుకోవాలి

ఫారెస్ట్ భూముల్లో పేదలు సాగు చేస్తే అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, అదే సమయంలో వందల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపణలు వచ్చినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు సంబంధించిన భూముల విషయంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తున్న భూములపై త్వరలోనే బీజేపీ ఆధ్వర్యంలో దండయాత్ర చేపడతామని, ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచేలా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య రాజకీయ అవగాహన ఉందంటూ బండి సంజయ్ ఆరోపించారు. భూ  వ్యవహారాలపై విచారణను నిష్పక్షపాతంగా, వేగంగా పూర్తి చేసి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>