కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లా వ్యాప్తంగా నూతనంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు (Smart Ration Cards) లబ్ధిదారులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి. కార్డులపై లబ్ధిదారుల పేర్లు, గ్రామాల పేర్లు, పిన్ కోడ్లు తప్పుల తడకగా ముద్రించడంతో జిల్లా అంతటా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వైరా నియోజకవర్గ పరిధిలోని కొనిజర్ల మండలం తీగల బంజర గ్రామంలో ఇటీవల పంపిణీ చేసిన కార్డుల్లో విలేజ్ పేరు ‘గొబ్బుగుర్తి’గా ముద్రించడమే కాకుండా, పిన్ కోడ్ కూడా పూర్తిగా తప్పుగా రావడం కలకలం రేపింది.
తీగల బంజర పంచాయతీ పరిధిలోని కార్డులన్నింటిలోనూ ఇవే తప్పులు దొర్లడంతో, స్థానిక సర్పంచ్, గ్రామస్తులు ఆ కార్డులను స్వీకరించడానికి నిరాకరించి అధికారులకు తిప్పి పంపించారు. కార్డుల్లో పొరపాట్లను గుర్తించిన వెంటనే ఎంఆర్ఓ, ఆర్ఐ, జీపీవోలకు ఫిర్యాదు చేసి, కార్డులను తిరిగి ఇచ్చి వారం రోజులు గడుస్తున్నప్పటికీ అధికారులు ఇప్పటివరకు సవరించిన కార్డులను అందజేయలేదని స్థానికులు బుధవారం మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామం పేరు, పిన్ కోడ్ మారడం వల్ల రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి పక్క గ్రామాలకు తిరగాల్సి వస్తుందేమోనని నిరుపేదలు, చదువుకోని వృద్ధులు భయాందోళన చెందుతున్నారు.
అసలు లబ్ధిదారులెవరూ స్మార్ట్ రేషన్ కార్డులు (Smart Ration Cards) కావాలని కోరలేదని, కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం హడావుడిగా ఈ ప్రక్రియను తెచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వైరా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ దాదాపు ప్రతి మండలంలో నాలుగైదు గ్రామాల్లో ఇదే తరహా అడ్రస్, పిన్ కోడ్ తప్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తప్పులను సరిచేసి సరైన కార్డులను పంపిణీ చేయాలని, లేనిపక్షంలో ఆందోళన బాట పడతామని లబ్ధిదారులు స్పష్టం చేస్తున్నారు.

