కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (Telangana Employees JAC) ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. సెప్టెంబర్ 18, 2026న ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని (Telangana Secretariat) ఆరో అంతస్తు, రూమ్ నంబర్ 20లో సమావేశం ఏర్పాటు చేశారు.
సెప్టెంబర్ 9న నిర్ణయం మేరకు సమావేశం
గతంలో సెప్టెంబర్ 9న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే తాజా భేటీని ఏర్పాటు చేసినట్లు సాధారణ పరిపాలన (సర్వీసెస్ వెల్ఫేర్) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తదితర వర్గాలకు సంబంధించిన అంశాలపై జేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చించనున్నట్లు సమాచారం. సమావేశం ద్వారా వివిధ సమస్యలు, డిమాండ్లపై ఇరుపక్షాల మధ్య చర్చకు అవకాశం ఏర్పడనుంది.
జేఏసీ ప్రతినిధులకు ప్రభుత్వ ఆహ్వానం
సెప్టెంబర్ 18న జరిగే సమావేశానికి జేఏసీ (Employees JAC) అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో పాటు సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని ప్రభుత్వం లేఖ ద్వారా కోరింది. నిర్ణీత సమయానికి సమావేశానికి హాజరై తమకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరగనున్న ఈ సమావేశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : కడ్తాల్ అయ్యప్ప స్వామి ఆలయంలో అద్భుతం
Follow Us On: X(Twitter)

