కలం, స్టేషన్ ఘన్‌పూర్: పాలిటెక్నిక్ అధ్యాపకుల సమస్యలపై చర్చించేందుకు వెళ్లిన జేఏసీ ప్రతినిధులతో కమిషనర్ దురుసుగా వ్యవహరించారని నిరసిస్తూ స్టేషన్ ఘన్‌పూర్ (Station Ghanpur) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు నిరసన చేపట్టారు. కమిషనర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, అధ్యాపకులు, సిబ్బందికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జీవో 97 రద్దు, సాంకేతిక విద్యాశాఖ విలీనానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సెప్టెంబర్ 15న జేఏసీ ప్రతినిధులు కమిషనర్‌ను కలిసేందుకు వెళ్లారు.
ఈ సందర్భంగా కమిషనర్ తమను ఉద్దేశించి “మీకు బుద్ధి లేదు, చదువు రాదు, బుర్ర లేదు” అంటూ మాట్లాడారని జేఏసీ ప్రతినిధులు ఆరోపించారు. అధ్యాపకుల సమస్యలపై చర్చించాల్సిన సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషనర్ వ్యాఖ్యలను నిరసిస్తూ 31వ రోజు లంచ్ అవర్ ప్రొటెస్ట్‌లో భాగంగా అధ్యాపకులు కళాశాల ప్రాంగణంలో నేలపై కూర్చొని ఆందోళన చేపట్టారు. కమిషనర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జీవో 97 రద్దుపై స్పష్టమైన నిర్ణయం కావాలి
ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని అధ్యాపకులు మరోసారి డిమాండ్ చేశారు. సాంకేతిక విద్యాశాఖ విలీన నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించి, శాఖను యథావిధిగా కొనసాగించాలని కోరారు. సాంకేతిక విద్యాశాఖను విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని స్పష్టం చేశారు. జీవో 97పై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకపోతే విద్యార్థులపై ప్రభావం పడే అవకాశం ఉందని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.
అధ్యాపకులతో చర్చలు జరిపి, వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమిషనర్ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పడం, జీవో 97ను రద్దు చేయడం తమ ప్రధాన డిమాండ్లని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లోకల్ జేఏసీ అధ్యక్షుడు సీహెచ్ యాదయ్య, జనరల్ సెక్రటరీ అశోక్, ప్రిన్సిపల్ గంగారెడ్డి, సెంట్రల్ జేఏసీ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, ధనుంజయ్, శ్రీధర్‌రెడ్డి, శ్రీకర్, కిరణ్‌కుమార్, సంపత్‌కుమార్, రవీందర్, సుకన్య, అనిల్‌కుమార్, రాజు, జావేద్‌పాషా, నరేష్, ప్రశాంత్, రామ్ నర్సయ్య, సిద్ధులు, పోతరాజు, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
Also Read : KCR ఫామ్‌హౌజ్ పై సీఎం సంచలన నిర్ణయం..!
Follow Us On : WhatsApp

