కలం, వెబ్ డెస్క్ : అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఒక విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా జరిగిన ఒక తీవ్రమైన రోడ్డు ప్రమాదాన్ని లైవ్ కవరేజ్ చేయడానికి వెళ్లిన వార్తా సంస్థ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలిపోయింది (Los Angeles Helicopter Crash). ఈ ఘటనలో ప్రమాదానికి గురైన వాహనాలు, హెలికాప్టర్ కూలిన ప్రాంతం రెండింటినీ కలిపి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
అసలు ఏం జరిగిందంటే..
లాస్ ఏంజెల్స్ వీధిలో ఒక వేగంగా వచ్చిన కారు బస్సును ఢీకొట్టి, ఆపై పక్కనే ఉన్న స్తంభాన్ని గట్టిగా గుద్దుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్ర నష్టం జరగడంతో, ఆ దృశ్యాలను గగనతలం నుంచి కవర్ చేయడానికి KNBC-TV సంస్థకు చెందిన న్యూస్ హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది. అయితే, కవరేజ్ అందిస్తున్న సమయంలో హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి కిందకు దూసుకొచ్చింది. ఈ సమయంలో రెండు వ్యాపార సముదాయల మధ్యలో హెలికాప్టర్ పడిపోయింది. దీంతో క్షణాల్లోనే అది పేలిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ భయానక ప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక, రక్షణ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ రెండు దుర్ఘటనల్లో కలిపి మొత్తం ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. న్యూస్ హెలికాప్టర్ గాల్లో అదుపు తప్పడానికి గల కచ్చితమైన సాంకేతిక కారణాలు ఏమిటనే దానిపై విమానయాన భద్రతా అధికారులు, పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.

