దానం నాగేందర్‌కు బిగ్ టెన్షన్.. నేడు హైకోర్టు కీలక తీర్పు!

కలం, తెలంగాణ బ్యూరో: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ (Danam Nagender) పార్టీ ఫిరాయించారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై ఇప్పటికే విచారణ ముగించిన హైకోర్టు.. నేడు తీర్పు వెలువరించనున్నది. ఆయన బీఆర్ఎస్ బీ-ఫామ్ మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి ఫిరాయించారంటూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.

కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత దానం నాగేందర్ ఆ పార్టీ బీ-ఫామ్ మీద 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారని… ఆయనపై అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్లు ఆరోపించారు. సుప్రీంకోర్టుకు వెళ్లడంతో నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశించిందని, కానీ స్పీకర్ మాత్రం విచారణ చేపట్టి పార్టీ ఫిరాయించలేదంటూ ప్రకటించారని పిటిషనర్లు పేర్కొన్నారు. అన్ని వైపుల నుంచి వాదనలను విన్న హైకోర్టు బెంచ్ గతంలో తీర్పును రిజర్వు చేసింది. నేడు జడ్జిమెంట్ ఇవ్వనున్నది. దీంతో దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తుందా? లేక స్పీకర్ నిర్ణయానికి వదిలేస్తుందా? లేక క్లీన్‌చిట్ ఇస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ఇచ్చే తీర్పుతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందా? లేదా? అన్నది తేలిపోనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>