కలం, వెబ్ డెస్క్ : మూడు రోజుల విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. నేటితో ఈ సమావేశాలు ముగియనుండగా, సభలో పలు కీలక అంశాలపై వేడివేడిగా చర్చ జరగనుంది. ముఖ్యంగా 22A నిషేధిత భూముల వివాదం, ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలు, భూముల రిజిస్ట్రేషన్లకు ఎదురవుతున్న తీవ్ర ఇబ్బందులపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం స్పష్టతనివ్వనుంది. ఈ మేరకు సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటన చేస్తారని, ప్రభుత్వం తీసుకుంటున్న దిద్దుబాటు చర్యలను సుదీర్ఘంగా వివరిస్తారని సమాచారం. గతంలో జరిగిన భూకేటాయింపులు, రిజిస్ట్రేషన్ల అక్రమాలపై విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, దాని కారణంగా తలెత్తుతున్న కరవు, తీవ్ర నీటి కొరత మరియు వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న సవాళ్లపై కూడా సభలో స్వల్పకాలిక చర్చ సాగనుంది. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం చేసిన నివారణ చర్యలు, రైతులకు అందించాల్సిన ఉపశమన మార్గాలపై ప్రజాప్రతినిధులు చర్చించనున్నారు. కీలకమైన భూ సమస్యలు, వర్షాభావ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే వివరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

