కలం, ఖమ్మం బ్యూరో: “పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, క్షేత్రస్థాయి ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహించడమే మార్గంగా ముందుకు సాగుతాం” అని తెలంగాణ రక్షణ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాధ్యుడు సముద్రాల క్రాంతి కుమార్ (Kranti Kumar) స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యతలను స్వీకరించిన అనంతరం మంగళవారం ఆయన కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తనకు కీలక బాధ్యతలు అప్పగించినందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం క్రాంతి కుమార్ మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి గ్రామం, పట్టణం, మండలంలో పార్టీ విస్తరణను వేగవంతం చేస్తామని వెల్లడించారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించి, వాటి పరిష్కార నిమిత్తం ప్రజల తరఫున నిరంతరం పోరాడటానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.యువత, మహిళలు, రైతులు, కార్మికులు మరియు విద్యార్థులను విశేషంగా పార్టీతో అనుసంధానిస్తూ, కేడర్‌ను సమన్వయం చేసుకుని జిల్లాలో తెలంగాణ రక్షణ సేనకు తిరుగులేని ప్రజాదరణ తీసుకురావడమే ధ్యేయంగా శ్రమిస్తానని స్పష్టం చేశారు.

