కలం, వెబ్ డెస్క్ : వైసీపీ, ‘సాక్షి’ పత్రికపై మంత్రి అచ్చెన్నాయుడు (Achchennaidu) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వకుండా.. నియామకాలు చేపడితే అనుమానిస్తూ నిరుద్యోగులకు వ్యతిరేకంగా వైసీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని మంత్రి విమర్శించారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న 300 పోస్టుల్లో కూటమి ప్రభుత్వం 160 వెటర్నరీ డాక్టర్ల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిందన్నారు.
చరిత్ర తెలుసుకోకుండా విషపు రాతలు :
ఉద్యోగాలు ఇస్తుంటే ‘మరో రిక్రూట్మెంట్పై అనుమానాలు’ అంటూ విషపు రాతలు రాస్తున్నారని సాక్షిపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చరిత్ర తెలుసుకోకుండా రాతలు రాస్తే అది వార్త కాదు.. విష ప్రచారం అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వెటర్నరీ పోస్టుల భర్తీలో పరీక్ష విధానం తీసుకొస్తే నష్టపోతామని అభ్యర్థులు చెప్పారన్నారు. వెటర్నరీ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి మేరకు అన్ని అంశాలను పరిశీలించాకే పాత విధానంలోనే పశుసంవర్ధక శాఖ ద్వారా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి (Achchennaidu) స్పష్టం చేశారు.
ఇందులో దాయడానికి ఏం లేదని ప్రభుత్వం జారీ చేసిన జీవోలోనే అన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. భవిష్యత్ లో నియామకాలను ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షా విధానంలో నిర్వహిస్తామని పేర్కొన్నట్లు మంత్రి వివరించారు. అయినప్పటికీ అనుమానాలంటూ పొగ సృష్టించి అందులో రాజకీయ చలి కాచుకోవడం సాక్షికే చెల్లింది అని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.
డైరెక్టర్ ఎవరో తెలుసుకోకుండా కథనం రాస్తారా? :
‘సాక్షి’ కథనంలో ప్రస్తుతం పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా దామోదర్ నాయుడు ఉన్నట్లు పేర్కొనడాన్ని అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్గా లేరని, ఒక మహిళా అధికారి ఇన్చార్జి డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఒక శాఖకు ప్రస్తుతం డైరెక్టర్ ఎవరో తెలుసుకోవడానికి కూడా కనీస ప్రయత్నం చేయకుండా కథనం రాసి, ప్రభుత్వంపై బురద చల్లితే దాన్ని జర్నలిజం అంటారా? అని ప్రశ్నించారు. హోంవర్క్ సున్నా.. ఆరోపణలు వంద. వాస్తవాలు సున్నా.. విషప్రచారం వంద అని సాక్షి ని విమర్శించారు.

