కలం, వెబ్ డెస్క్ : ద్రవ్యోల్బణం వేగం పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI Inflation) మరోసారి వడ్డీ రేట్లను పెంచే దిశగా అడుగులు వేయొచ్చని సిస్టమాటిక్స్ గ్రూప్ నివేదిక అంచనా వేసింది. అక్టోబర్ తొలి వారంలో జరగనున్న ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో ఈ మార్పునకు సంబంధించిన తొలి సంకేతాలు వెలువడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం 5.25 శాతంగా ఉన్న రెపో రేటు దశలవారీగా 6.5 శాతానికి చేరే అవకాశముందని నివేదిక అభిప్రాయపడింది.
మూడు నెలలుగా లక్ష్యాన్ని దాటిన ద్రవ్యోల్బణం
రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 4.82 శాతానికి చేరింది. జులైలో నమోదైన 4.45 శాతంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. కొత్త సిరీస్‌లో ఇదే అత్యధిక స్థాయిగా నమోదైంది. ముఖ్యంగా వరుసగా మూడో నెలలోనూ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించిన 4 శాతం మధ్యకాలిక లక్ష్యాన్ని అధిగమించడం ఆందోళన కలిగిస్తోంది. ధరల ఒత్తిడి మరింత కాలం కొనసాగితే ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఆహార ధరలే ప్రధాన ఒత్తిడి
ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 5.95 శాతానికి పెరిగింది. జులైలో ఇది 5.52 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండగా, అక్కడ ఆహార ద్రవ్యోల్బణం 6.13 శాతానికి చేరింది. కూరగాయలు, సుగంధ ద్రవ్యాల ధరలు ప్రధానంగా పెరగడంతో కుటుంబాల నెలవారీ ఖర్చులపై ప్రభావం పడుతోంది. ఈ పరిణామం ముఖ్యంగా గ్రామీణ వినియోగదారులపై అధిక భారాన్ని మోపే అవకాశం ఉంది.
6 శాతాన్ని దాటే ప్రమాదం
హోల్‌సేల్ ధరల ద్రవ్యోల్బణం కూడా ఆగస్టులో 9.92 శాతానికి చేరింది. ఇంధనం, ఇంధన ఆధారిత ఉత్పత్తుల ధరలు, తయారీ వ్యయాలు పెరగడం వల్ల ధరల ఒత్తిడి ఇతర రంగాలకూ విస్తరిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే అక్టోబర్-నవంబర్ నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతాన్ని దాటే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావంతో ఆహార సరఫరా దెబ్బతినడం, అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరగడం వంటి అంశాలు పరిస్థితిని మరింత క్లిష్టం చేయొచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎంపీసీ సమావేశం ఆర్‌బీఐ తదుపరి విధాన నిర్ణయాలకు కీలకంగా మారనుంది.
Also Read : రూ.3,383 కోట్ల ఆస్తులు.. వీధుల్లో బిచ్చగాడిగా బీజేపీ ఎమ్మెల్యే!
Follow Us On: X(Twitter)

