కలం, వెబ్ డెస్క్: ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ గృహాల (Indiramma Towers LIG Houses) లక్కీ డ్రాలో ఎంపికైన అభ్యర్థుల్లో ఇప్పటివరకు 6,660 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్, హౌసింగ్ కమిషనర్ వీపీ గౌతమ్ స్పష్టం చేశారు. మిగిలిన అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలనను కూడా ఈ వారంలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులుగా నిర్ధారించబడిన లబ్ధిదారులకు ఈ వారంలోనే అధికారిక కేటాయింపు పత్రాలు జారీ చేస్తామని అన్నారు. లక్కీ డ్రాలో ఎంపికైన అభ్యర్థులు తమకు ఇల్లు కేటాయించబడుతుందా లేదా అనే ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయి పరిశీలన, అర్హత నిర్ధారణ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియను ఆసరాగా చేసుకుని కొందరు బ్రోకర్లు, మధ్యవర్తులు ఇల్లు మంజూరు చేయిస్తామని అమాయక లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని గౌతమ్ తెలిపారు. “గృహాల కేటాయింపు ప్రక్రియలో బ్రోకర్లు, మధ్యవర్తులు / ఇతర వ్యక్తులకు ఎలాంటి పాత్ర లేదు. లబ్ధిదారులు ఎవరికీ లంచం, కమీషన్ లేదా ఇతర రూపంలో డబ్బులు చెల్లించవద్దు. గృహాల కేటాయింపు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశించిన అర్హతలు, అధికారిక ప్రక్రియ ఆధారంగానే జరుగుతుంది” అని వివరించారు.
లబ్ధిదారులు గృహాల కేటాయింపు, క్షేత్రస్థాయి పరిశీలన, కేటాయింపు పత్రాలు, మొదటి విడత చెల్లింపు తదితర అధికారిక సమాచారం కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్సైట్ tghb.telangana.gov.in ను సందర్శించవచ్చని లేదా కాల్ సెంటర్ నంబరు 040-24603572ను సంప్రదించవచ్చని గౌతమ్ తెలిపారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారికంగా జారీ చేసే ప్రకటనలు, కేటాయింపు పత్రాలు, సంబంధిత అధికారుల సూచనలను మాత్రమే విశ్వసించాలని లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు.

