ఖమ్మంలో ‘ఎకో ఫ్రెండ్లీ’ వినాయక విగ్రహాల పంపిణీ

కలం, ఖమ్మం బ్యూరో : వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని కాలుష్య రహితంగా పండుగను జరుపుకోవాలనే సందేశంతో ఆదివారం ఖమ్మం (Khammam), కొత్తగూడెం జిల్లాల్లో ‘ఎకో ఫ్రెండ్లీ’ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర భక్తులకు ప్రత్యేకంగా తయారు చేయించిన మట్టి విగ్రహాలను ఉచితంగా అందజేశారు.

కేవలం విగ్రహమే కాకుండా పత్రి, జంధ్యం, పసుపు, కుంకుమ, హారతి కర్పూరం తదితర 12 రకాల పూజా సామాగ్రిని అట్టపెట్టెలలో భద్రపరిచి పంపిణీ చేశారు. ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ ఆధ్వర్యంలో, కొత్తగూడెంలో డీఎస్పీ ఆదినారాయణ, సీఐ కరుణాకర్ సమక్షంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఈ విగ్రహాలను ప్రజలకు, పోలీస్ సిబ్బందికి అందజేశారు.

​మరోవైపు లక్ష్మీదేవిపల్లి, లోతువాగు గ్రామ పంచాయతీలలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ, యువజన, మహిళా విభాగాల ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ జరగ్గా, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులతో తయారుచేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమై జీవకోటికి ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్వకాలం నుంచీ వస్తున్న సంప్రదాయం ప్రకారం ప్రకృతికి హాని కలగకుండా మట్టి విగ్రహాలనే పూజించి నిమజ్జనం చేయాలని, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు అందరూ కాలుష్య రహిత పండుగలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>