కలం, నల్లగొండ: శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ (Nalgonda Lok Adalat) సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో వేలాది కేసులు విజయవంతంగా పరిష్కారమయ్యాయి. పోలీస్ శాఖ, న్యాయ విభాగాల పటిష్ట సమన్వయంతో ప్రజలకు త్వరితగతిన, తక్కువ ఖర్చుతో న్యాయం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది.
నల్లగొండ జిల్లాలో 6,013 కేసులు..
నల్గొండ జిల్లా పరిధిలో మొత్తం 6,013 కేసులు పరిష్కారమైనట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, తెలిపారు. వీటిలో 3,121 డ్రంకన్ డ్రైవ్ కేసులు, 2,208 ఈ-పెట్టీ కేసులు, 672 ఐపీసీ కేసులు, 12 ఎస్ఎల్ఎల్ కేసులు ముగిసినట్లు చెప్పారు. చిన్నచిన్న కేసులను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడం వల్ల కోర్టులపై భారం తగ్గడమే కాకుండా ప్రజల సమయం, ఖర్చు ఆదా అవుతాయని సూచించారు. ఈ సందర్భంగా కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, సంబంధిత శాఖల ప్రతినిధులను జిల్లాల ఎస్పీలు అభినందించారు.
సూర్యాపేట జిల్లాలో 4,475 కేసులు..
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,475 పెండింగ్ కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఐపీఎస్ తెలిపారు. ఇందులో 851 క్రిమినల్ కేసులు, 1,936 డ్రంకన్ డ్రైవ్ కేసులు, 1,688 ఈ-పెట్టీ కేసులు ఉన్నాయన్నారు. వీటితో పాటు సైబర్ నేరాలకు సంబంధించి 31 కేసుల్లో బాధితులకు చెందిన రూ.46.81 లక్షల నగదును రికవరీ చేసి, వారి ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరో సిబ్బంది పటిష్ట పర్యవేక్షణతో ఈ ఫలితాలు సాధించినట్లు వెల్లడించారు.

