కలం, జోగులాంబ గద్వాల: ప్రతియేటా అశ్వయుజ మాసంలో ప్రారంభమయ్యే తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలకు గద్వాల చేనేత పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది. ఎందువలనంటే నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున తిరుమల వేంకటేశ్వరునికి ఇక్కడ నేత మగ్గంపై తయారు చేసే ఏరువాడ జోడు పంచెలను అలంకరించిన తర్వాతనే బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం గద్వాల చేనేత పరిశ్రమ (Gadwal Handloom) చేసుకున్న పుణ్యఫలంగా కార్మికులు భావిస్తారు.
ఈ యేడాది జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల (Navaratri Brahmotsavams) సందర్భంగా గద్వాల సంస్థానాధీశులు కృష్ణ రాంభూపాల్ ఆధ్వర్యంలో చేనేత ప్రతినిధులు గద్వాల ఏరువాడ జోడు పంచలను సంప్రదాయబద్ధంగా తిరుమల తిరుపతి ఈఓకు సమర్పించారు. గద్వాల చేనేత కళాకారులు ప్రత్యేకంగా తయారు చేసిన జోడు పంచల సమర్పణతో గద్వాల–తిరుమల ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుబంధం మరోసారి చాటిచెప్పారు.
నాలుగు శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం
కృష్ణరాం భూపాల్, గద్వాల చేనేత కళాకారుల బృందం తిరుమలకు చేరుకుని గద్వాలలో ప్రత్యేకంగా తయారు చేసిన జోడు పంచలను శ్రీవారి ఆలయంలో సమర్పించారు. గద్వాల సంస్థానం–తిరుమల మధ్య కొనసాగుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుబంధానికి ఈ వస్త్ర సమర్పణ ప్రతీకగా నిలిచింది. గత 400 సంవత్సరాలుగా గద్వాల సంస్థానం వ్యవస్థాపకుల కాలం నుంచే శ్రీవారికి పవిత్ర వస్త్రాలను సమర్పించే సంప్రదాయం కొనసాగుతోందని ప్రతినిధులు తెలిపారు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో గద్వాల చేనేత కళాకారులు ప్రత్యేక శ్రద్ధతో ఏరువాడ పంచలను తయారు చేసి స్వామి వారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
చేనేత కళకు మరింత గుర్తింపు
గద్వాల ప్రాంతం చేనేత కళకు ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.ఇక్కడి కళాకారులు తమ సంప్రదాయ నైపుణ్యంతో ప్రత్యేకమైన వస్త్రాలను తయారు చేస్తుంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పంచలను సమర్పించడం ద్వారా ఈ చేనేత కళకు మరింత ప్రాచుర్యం లభిస్తోందని ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సంప్రదాయం వల్ల చేనేత కళాకారుల నైపుణ్యానికి గౌరవం లభించడంతో పాటు వారి ఉపాధికి కూడా ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.
తరతరాలుగా వస్తున్న చేనేత వారసత్వాన్ని కాపాడటంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకంగా మారుతున్నాయని చెప్పారు.
చారిత్రక, సాంస్కృతిక వైభవానికి మరింత వెలుగు
గద్వాల చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్రాలు శ్రీవారి సేవలో భాగం కావడం తమకు ఎంతో గర్వకారణమని ప్రతినిధులు పేర్కొన్నారు. గద్వాల ప్రాంత చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని మరింతగా వెలుగులోకి తీసుకురావడంలో శ్రీవారికి వస్త్ర సమర్పణ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గద్వాల సంస్థానం నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయం కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమమే కాకుండా స్థానిక చేనేత కళ, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తోందని తెలిపారు.

