కలం, తెలంగాణ బ్యూరో: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు, ఎర్రవల్లిలో పసుపు నీళ్ల అంశంతో ప్రజల్లో పల్చబడిన బీఆర్ఎస్‌పై విరుచుకుపడేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. అసెంబ్లీ వేదికగా 22-ఏ అంశంలో గత బీఆర్ఎస్ నిర్వాకం, భూ దోపిడీ, నిషేధిత జాబితాలో పెట్టి భూములను అనుయాయులకు కట్టబెట్టిన తీరుతో డిఫెన్స్‌లో పడిన బీఆర్ఎస్‌ను మరింత దెబ్బకొట్టేలా ఈ నెల చివరిలోనే సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16తో ముగుస్తున్నాయి. ఆ తర్వాత బీఆర్ఎస్‌ను మరింత డీమోరల్ చేసేలా కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నది. ఇందులో భాగంగానే ఈ నెల చివరకు సిరిసిల్లలో భారీ బహిరంగసభ పెట్టి కేటీఆర్ సహా బీఆర్ఎస్ నిర్వాకాన్ని ఎండగట్టాలని సీఎం రేవంత్ (Revanth Reddy) భావిస్తున్నారు.
ఇప్పటికే సిరిసిల్ల, సిద్దిపేటలో దండయాత్ర చేస్తానని సీఎం ప్రకటించి కేటీఆర్, హరీశ్‌రావు గుండెల్లో గుబులు సృష్టించారు. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో డైలమాలో ఉన్న ఆ పార్టీ ఇరువురు నేతలకు రానున్న రోజుల్లో మరింత షాక్ ఇచ్చేలా సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. 22-ఏ భూముల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని భావించిన వారిద్దరికీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో పలు ఉదాహరణలను ప్రస్తావించి గుక్క తిప్పుకోకుండా చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో సీఎం సిరిసిల్ల, సిద్దిపేట పర్యటనపై కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సిరిసిల్ల, సిద్దిపేటపైనే స్పెషల్ ఫోకస్ ఎందుకు?
గత ప్రభుత్వం చాలా నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేసి కేవలం గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట్‌లను మాత్రమే అభివృద్ధి చేసిందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీల్లో బలమైన అభిప్రాయం ఉన్నది. ఇతర నియోకవర్గాలతో పోలిస్తే ఈ మూడింటికే భారీ స్థాయిలో నిధులు మంజూరయ్యాయని, డెవలప్‌మెంట్ వర్క్స్ ఎక్కువగా ఆ మూడు చోట్లే జరిగాయని గత ప్రభుత్వంలోనే చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో 2014-23 మధ్యకాలంలో ఈ మూడు నియోజకవర్గాల్లో ఎక్కడెంత నిధులను ప్రభుత్వం కేటాయించిందో సిరిసిల్ల సభ వేదికగా సీఎం రేవంత్ ప్రస్తావించే అవకాశమున్నది.
ఇతర నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేసి కేవలం ఆ మూడింటిమీదనే ప్రభుత్వం ఎందుకు ఫోకస్ పెట్టిందో, సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపించిందో సీఎం తన స్పీచ్ ద్వారా ఎండగట్టే చాన్స్ ఉంది. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ పేరుతో సిరిసిల్లకు భారీ స్థాయి నిధుల కేటాయింపు, కార్పొరేట్ స్కూల్‌ను మరిపించేలా ప్రభుత్వ స్కూల్ నిర్మాణం ఆ ఒక్క చోటనే నిర్మించడం.. ఇలాంటి అంశాలను కూడా సీఎం ఏకరువు పెట్టే అవకాశమున్నది. ప్రతిపక్షాలకు చెందిన నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేసి కల్వకుంట్ల కుటుంబానికి చెందినవాటినే పట్టించుకోవడంపై ఇప్పటికే విమర్శలుండగా, సీఎం చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొన్నది.
వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల(Sircilla)లో కేటీఆర్‌కు షాక్ ఇచ్చేలా..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో కేటీఆర్‌కు షాక్ ఇచ్చేలా ఇప్పటి నుంచే సీఎం రేవంత్ పావులు కదపనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కేటీఆర్ గెలిచే అవకాశం లేకుండా పొలిటికల్‌గా ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయడం మీద సీఎం దృష్టి సారించారు. ఈసారి ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌కు ప్రధాన ప్రతిపక్ష స్థానం లేకుండా చేస్తానని, కాంగ్రెస్ 90 సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పలు మార్లు వ్యాఖ్యానించారు.
కేటీఆర్(KTR)ను మరోసారి సిరిసిల్లలో గెలవనీయకుండా చేసే లక్ష్యంతోనే ప్రత్యేకంగా ఆ సెగ్మెంట్‌పై సీఎం ఫోకస్ పెట్టనున్నారు. బతుకమ్మ చీరల గోల్‌మాల్ మొదలు అనేక విషయాల్లో సిరిసిల్ల అంశాన్ని ప్రస్తావించి కేటీఆర్ ఇమేజ్‌ను ప్రజల్లో డ్యామేజ్ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. నేరెళ్ల ఇసుక మాఫియా ఆగడాల మొదలు దళితులను లారీలతో తొక్కి చంపించారన్న ఆరోపణల వరకు అన్నింటినీ సిరిసిల్ల సభ వేదికగా సీఎం ప్రస్తావించే అవకాశమున్నది. ఇటీవల నకిరేకల్‌లో జరిగిన సభ వేదికగా కేటీఆర్‌కు, హరీశ్‌రావుకు ఓపెన్ చాలెంజ్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి… కాచుకో అంటూ వారిని హెచ్చరించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల చివర్లో జరిగే సిరిసిల్ల బహిరంగసభను సీఎంతో పాటు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ సహా విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు భారీ స్థాయి ఏర్పాట్లు చేయడంపై దృష్టి పెట్టనున్నారు.
Also Read : ధరణి భూ దోపిడీపై సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్?
Follow Us On : WhatsApp

