కలం, వనపర్తి: జిల్లాలో (Wanaparthy) 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్‌కుమార్ సూచించారు. శనివారం గోపాల్పేట మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటర్ల నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాలకు వచ్చే అర్హులైన పౌరులకు అవసరమైన సమాచారం అందించాలని, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, వివరాల మార్పులు, చేర్పులు, తొలగింపులను నిబంధనల ప్రకారం చేపట్టాలని బీఎల్వోలకు సూచించారు. ముఖ్యంగా యువత ఓటరుగా నమోదు అయ్యేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
కొత్త ఓటర్ల నమోదుకు ఫారం-6, ఓటరు జాబితాలో వివరాల సవరణలకు ఫారం-8 ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. మరణించిన వ్యక్తుల పేర్లు, శాశ్వతంగా చిరునామా మార్చుకున్న ఓటర్ల వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి పారదర్శకంగా తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తిలక్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

