కలం, వనపర్తి: అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి (Wanaparthy) మండలం నాచహల్లి, కృష్ణగిరి, పెద్దగూడెం తండా, సవాయిగూడెం గ్రామాలకు చెందిన రైతులు శనివారం ఆందోళనకు దిగారు. నాచహల్లి సబ్‌స్టేషన్ సమీపంలోని వనపర్తి–పెబ్బేరు ప్రధాన రహదారిపై బైఠాయించి విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ చంద్రశేఖర్ అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే డీఈని అక్కడికి రప్పించి మాట్లాడించాలని రైతులు పట్టుబట్టడంతో ఏఈ ఫోన్లో డీఈతో రైతులకు మాట్లాడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం రైతులకు 13 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెబుతోందని, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్రకటిత కోతలతో పంటలకు సాగునీరు అందక నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏఈతో కలిసి లాగ్‌బుక్‌ను పరిశీలించిన రైతులు.. వాస్తవంగా సరఫరా చేసిన సమయం కంటే ఎక్కువగా విద్యుత్ ఇచ్చినట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
‘కేసీఆర్ ప్రభుత్వం పోయినప్పుడే కరెంటు కూడా పోయిందా?’ అంటూ రైతులు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోకుండా వెంటనే అప్రకటిత కోతలను నిలిపివేసి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళనలో మండల పార్టీ అధ్యక్షుడు కే. మాణిక్యం, సింగిల్‌విండో అధ్యక్షుడు రఘువరన్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ధర్మనాయక్, మాజీ మార్కెట్ వైస్‌చైర్మన్ డేగ మహేష్‌రెడ్డి, నాయకులు రవి ప్రకాష్‌రెడ్డి, నారాయణ నాయక్, శంకర్ నాయక్, టీకే నాయక్, సర్పంచ్ పద్మ వెంకటయ్య, మాజీ సర్పంచ్ బాలకృష్ణ, మహేష్, అంజి, రూప్ల నాయక్, గోవిందు నాయక్, శివ, ఆనంద్, తులసి రామకృష్ణ, శ్రీను, గ్రామస్తులు పాల్గొన్నారు.

