కలం, స్పోర్ట్స్ : ఈ ఏడాది బాలన్ డి ఓర్ అవార్డు గెలుచుకోవడానికి తను పూర్తి అర్హుడినని స్టార్ ఫుట్‌బాలర్ కిలియన్ ఎంబాపే (Kylian Mbappe) స్పష్టం చేశారు. రియల్ మాడ్రిడ్‌తో ట్రోఫీ సాధించకపోయినా, వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ సెమీస్‌లోనే వెనుతిరిగినా తన వ్యక్తిగత ప్రదర్శన అద్భుతంగా ఉందని ఆయన తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎంబాపే ఈ వ్యాఖ్యలు చేశారు.
బాలన్ డి ఓర్ అనేది వ్యక్తిగత ప్రదర్శనకు ఇచ్చే పురస్కారమని ఎంబాపే గుర్తు చేశారు. ఈ అవార్డు ఎప్పుడూ ఏకగ్రీవంగా ఎంపిక కాలేదని పేర్కొన్నారు. మెస్సీ, రొనాల్డోల యుగం నుండి ప్రత్యేకమైన ప్రదర్శన ఇచ్చే ఆటగాళ్లకే ఈ అవార్డు దక్కుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సీజన్లో ఎంబాపే ఛాంపియన్స్ లీగ్‌లో 15, లా లీగాలో 25 గోల్స్ సాధించారు. అంతేకాకుండా ఫిఫా వరల్డ్ కప్‌లో తన మొత్తం గోల్స్ సంఖ్యను 22కు పెంచుకుని ఆల్-టైమ్ టాప్ స్కోరర్‌గా నిలిచారు.
ఈ క్రమంలో లియోనెల్ మెస్సీ పేరిట ఉన్న రికార్డును ఆయన బద్దలు కొట్టారు. ప్రసిద్ధ టోర్నీల్లో అత్యుత్తమంగా రాణించినందున ఈ ఏడాది తనకంటే మెరుగైన ఆటగాడు ఎవరూ లేరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఫ్రాన్స్ జాతీయ జట్టు కొత్త కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన జినెదిన్ జిదాన్‌ను ఎంబాపే ప్రశంసించారు. జిదాన్ ఫ్రెంచ్ ఫుట్‌బాల్‌కు అసలైన లెజెండ్ అని, ఆయన గొప్పతనానికి నిదర్శనమని కొనియాడారు.

