కలం, రామగుండం: సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ (MP Vamsi Krishna) స్పష్టం చేశారు. సింగరేణి 11 ఇంక్లైన్ RG-1 పరిధిలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడికి తీవ్ర గాయాలై ఆరు కుట్లు పడిన ఘటనపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. “ఈరోజు ఆ కార్మికుడు గాయాలతో బయటపడ్డాడు. కానీ రేపు అదే పరిస్థితి ప్రాణాపాయంగా మారకూడదు. అండర్‌గ్రౌండ్ గనుల్లో కూలిపోయే ప్రమాదం ఉన్న సున్నిత ప్రాంతాల్లో అత్యంత కఠినమైన భద్రతా చర్యలు అమలు చేయాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం బొగ్గు ఉత్పత్తి పెంపుకే కాకుండా, కార్మికుల ప్రాణ రక్షణకు ప్రాథమికంగా ఉపయోగించాలి. ఇటీవల బెల్లంపల్లిలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, భద్రతా వ్యవస్థపై యాజమాన్యం తక్షణమే సమగ్ర సమీక్ష నిర్వహించాలి” అని డిమాండ్ చేశారు.
ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజల రవాణా సౌకర్యార్థం హైదరాబాద్, సికింద్రాబాద్‌లతో మెరుగైన రైలు కనెక్టివిటీ కల్పించాల్సిన బాధ్యత రైల్వే శాఖపై ఉందన్నారు. సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్/హైదరాబాద్ మార్గంలో అదనపు రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ను కలిసి ఇప్పటికే విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.
రైల్వే శాఖకు ఉత్తర తెలంగాణ నుంచి భారీ స్థాయిలో ఫ్రైట్ (సరుకు రవాణా) ఆదాయం వస్తున్నప్పటికీ, ప్రయాణికులకు తగినన్ని రైలు సౌకర్యాలు కల్పించకపోవడం అన్యాయమన్నారు. ప్రజల అవసరాలు, రాబడి ఆధారంగా రైల్వే బోర్డు నీడ్ బేస్డ్ అధ్యయనం చేపట్టి, పండుగల ప్రత్యేక రైళ్లతో పాటు సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్ మధ్య శాశ్వత ప్రాతిపదికన రైళ్లను అందుబాటులోకి తేలాలని పేర్కొన్నారు.
అంబేద్కర్ భవనానికి తక్షణమే సింగరేణి స్థలం కేటాయించాలి
సామాజిక ప్రయోజనాల కోసం అంబేద్కర్ భవన నిర్మాణం చేపట్టేందుకు తన ఎంపీ ల్యాడ్స్ (MPLADS) నిధుల నుంచి రూ.50 లక్షలు ఇప్పటికే కేటాయించానని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. జిల్లా కలెక్టర్ స్థాయి నుండి సింగరేణి యాజమాన్యానికి ప్రతిపాదనలు వెళ్లినప్పటికీ స్థల కేటాయింపులో ఆలస్యం కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. “నిధులు సిద్ధంగా ఉన్నాయి, అధికారుల ఫాలోఅప్ నడుస్తోంది. సింగరేణి యాజమాన్యం ఇకనైనా జాప్యం చేయకుండా వెంటనే స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి మార్గం సుగమం చేయాలి” అని తేల్చిచెప్పారు.
కార్మికుల భద్రత, మెరుగైన రైలు కనెక్టివిటీ, అంబేద్కర్ భవన స్థల కేటాయింపు వంటి ఈ మూడు కీలక అంశాలపై సంబంధిత అధికారులు, యాజమాన్యాలు తక్షణమే స్పందించి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

