రాజకీయ విలువలు దిగజారుతున్నాయ్!: కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఖరిపై చాడ ఫైర్

కలం, నాగర్ కర్నూల్: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ వైఖరితో రాజకీయ హైడ్రామా నడుస్తోందని.. ఆ రెండు పార్టీలు రాజకీయ విలువలు దిగజారుస్తున్నాయని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) విమర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ సంప్రదాయాలను మంటగలిపేలా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని అన్నారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాలతో యువతలో రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి తగ్గిపోతోందని చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు వ్యక్తిగత దూషణలకు వేదికగా మారాయని అన్నారు. ఎవరు ఎవరిని ఎక్కువగా తిడితే వారే గొప్ప అన్నట్లుగా ఇరు పార్టీలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కరువు పరిస్థితులు, రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగడం లేదని అన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉన్నా రైతులు, ప్రజలను ఎలా ఆదుకోవాలనే దానిపై చర్చించకపోవడం బాధాకరమని అన్నారు.

90 శాతం అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల కోసం సీపీఐ ఆధ్వర్యంలో త్వరలో ప్రజా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పోరాటంలో 4వేల 500 మంది అమరుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. 10 వేల గ్రామాలను విముక్తి చేసిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను ప్రభుత్వం గుర్తించాలన్నారు. పేదలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచిన చారిత్రక ఘట్టాన్ని ప్రభుత్వం విస్మరించవద్దని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహిస్తున్నాయని, 33 జిల్లాలున్న తెలంగాణలో సెప్టెంబర్ 17ను అధికారికంగా ఎందుకు నిర్వహించరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నెల 17న తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఫయాజ్, నాయకులు హెచ్. ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>