కలం, కరీంనగర్ బ్యూరో: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న ఏబీవీపీ (ABVP) కార్యకర్తలపై పోలీసులు దారుణంగా ప్రవర్తించడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులని కూడా చూడకుండా కాళ్లు, చేతులు విరిగేలా గొడ్డును బాదినట్లు చావగొట్టడం పోలీసుల అహంకారానికి, ప్రభుత్వ దౌర్జన్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
అధికార పార్టీకి రెడ్ కార్పెట్.. ప్రతిపక్షాలపై దాడి!
కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని బండి సంజయ్ విమర్శించారు. అధికార పార్టీ నిరసనలకు రెడ్ కార్పెట్ వేస్తున్న పోలీసులు.. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల ఆందోళనలపై మాత్రం అమానుషంగా విరుచుకుపడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను దాడులతో భయపెట్టాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తోందని, ఈ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరపడిందని అన్నారు.
సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన నాయకులు
పోలీసుల లాఠీఛార్జ్, దౌర్జన్యం కారణంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్యాల రాకేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని బండి సంజయ్ తెలిపారు. తోటి నాయకులు సమయస్ఫూర్తితో సీపీఆర్ చేయడంతోనే రాకేష్ ప్రాణాలు నిలిచాయని, ఈ ఒక్క ఘటన చూస్తేనే పోరాడే విద్యార్థులపై పోలీసులు ఏ స్థాయిలో దాడులు చేస్తున్నారో అర్థమవుతోందని పేర్కొన్నారు. విద్యార్థి నాయకుడు అస్వస్థతకు గురికావడానికి పోలీసుల వైఖరే కారణమని స్పష్టం చేశారు.
అరెస్ట్ చేసిన ఏబీవీపీ నాయకులు, విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులందరికీ ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. విద్యార్థులకు నష్టం చేకూరుస్తున్న జీవో నంబర్ 9ని తక్షణమే రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ మెడలు వంచుతాం..
సర్కార్ నిర్లక్ష్యం వల్ల కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లలేక, ఉద్యోగాలు రాక అడ్డాకూలీలుగా మారుతున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థుల తరఫున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

