త్రిప్రయార్‌ శ్రీరాముడి సన్నిధిలో పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక పూజలు

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కేరళ (Kerala)లో ఆధ్యాత్మిక పర్యటన (Spiritual Tour) కొనసాగిస్తున్నారు. ఆయుర్వేద చికిత్స (Ayurvedic treatment) కోసం ప్రస్తుతం కేరళలో ఉన్న ఆయన శనివారం వేకువజామున ప్రముఖ గురువాయూర్‌ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ప్రాచీన శ్రీరామ క్షేత్రమైన త్రిప్రయార్‌ శ్రీరామస్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గురువాయూర్‌లో బాలకృష్ణుడి నిరాలంకార దర్శనం

వేకువజామున గురువాయూర్‌ (Guruvayur Temple) ఆలయానికి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌ స్వామివారి నిరాలంకార దర్శనం చేసుకున్నారు. సుమారు 30 నిమిషాల పాటు ప్రత్యేక సేవలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారి ఆరాధనను తిలకించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి పట్టు వస్త్రాలను సమర్పించారు. గర్భగుడిలో మూలవిరాట్టుకు నిర్వహించే ప్రత్యేక కైంకర్యాలను దర్శించుకుని ఆలయ సంప్రదాయాలను పాటించారు.

త్రిప్రయార్‌లో దీపారాధన సేవ

గురువాయూర్‌ అనంతరం పవన్‌ కల్యాణ్‌ త్రిప్రయార్‌ శ్రీరామస్వామి ఆలయానికి (Sri Ramaswamy Temple) వెళ్లారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆలయంలో అత్యంత విశిష్టమైనదిగా భావించే ‘దీపారాధన’ సేవలో పాల్గొన్నారు. ఒకరోజు దీపారాధన సేవకు విరాళం అందించారు. ఆలయ ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ మందిరంలోని ప్రధాన దీపాలను స్వయంగా వెలిగించారు.

ఆలయ సంప్రదాయ సేవల్లో పాల్గొన్న పవన్

శ్రీరామస్వామి సన్నిధిలో నిర్వహించే ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా ‘మీనుట్టు’, ‘వేది వజిపాడు’ సేవల్లోనూ పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. శంఖుచక్రాలు, ధనుస్సు, రత్నహారాలతో అలంకరించిన శ్రీరామచంద్రుడి దివ్య మంగళరూపాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీరామస్వామితో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణుడు, అయ్యప్పస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దక్షిణామూర్తి, వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు, వేదాశీర్వచనాలు స్వీకరించారు. అంతకుముందు ఆలయ బోర్డు చైర్మన్‌, కమిటీ సభ్యులు పవన్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆలయ సమీపంలోనే ఆయన ఆయుర్వేద చికిత్స పొందుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>