కలం, నేషనల్ డెస్క్: ప్రపంచ ఆర్థిక, రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే సరికొత్త శకానికి న్యూఢిల్లీ వేదికైంది. భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit).. శుక్రవారం ‘భారత్ మండపం’లో ముందస్తు దౌత్య చర్చలతో ఘనంగా ప్రారంభమైంది. నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రగతి మైదానంలోని అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్ ‘భారత్ మండపం’ వేదికగా ఈ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. బ్రిక్స్ కూటమి ఏర్పడి 20 ఏళ్లు పూర్తవుతున్న వేళ జరుగుతున్న ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, యూఎన్ సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రెస్ ఢిల్లీకి చేరుకున్నారు.
రష్యా అధ్యక్షుడితో ప్రత్యేక భేటీ..
బ్రిక్స్ సదస్సు (BRICS Summit) లాంఛనంగా ప్రారంభం కావడానికి ముందే ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య 50 నిమిషాల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు వాణిజ్యం, ఇంధనం, మౌలిక వసతుల రంగాల్లో సహకారంపై ఇరునేతలు కీలక చర్చలు జరిపారు. 2030 నాటికి ఇరుదేశాల వార్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చే లక్ష్యంతో సరికొత్త రోడ్ మ్యాప్‌కు ఆమోదం తెలిపారు.
సివిల్ న్యూక్లియర్ ఇంధన సరఫరా, రైల్వే, టన్నెలింగ్, స్టీల్ వాల్యూ చైన్ రంగాల్లో ఉమ్మడి భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టారు. భారతీయ సాహిత్య, సంస్కృతుల వైభవానికి ప్రతీకగా నిలిచే పురాతన తమిళ గ్రంథం ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద ప్రతిని ప్రధాని మోదీ.. అధ్యక్షుడు పుతిన్‌కు బహుమతిగా అందించడం ఈ భేటీలో ప్రధానంగా నిలిచింది. మానవ జీవితంలోని అన్ని కోణాలను ‘తిరుక్కురళ్’ స్పృశిస్తుందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.
దౌత్యమే ఏకైక మార్గం…
రష్యా–ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి స్థాపనకు చర్చలు, దౌత్యమే ఏకైక మార్గమని, ఇందుకోసం భారత్ తన వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని పుతిన్‌కు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది రష్యాలో జరిగే 24వ ఇండియా–రష్యా వార్షిక సదస్సు ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారు.
మోదీ-పుతిన్ కారు దౌత్యం..
మోదీ, పుతిన్ భేటీ తర్వాత చోటుచేసుకున్న ఓ దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షించింది. పుతిన్ తన అధికారిక బుల్లెట్‌ప్రూఫ్ లిమౌసిన్ ‘ఔరస్ సెనాట్’ వాహనంలో మోదీతో కలిసి ప్రయాణించారు. ‘చక్రాలపై కోట’గా పిలిచే ఈ అత్యాధునిక వాహనంలో ఇరువురు నేతలు భారత్ మండపంలో జరుగుతున్న ‘ఇన్నోప్రోమ్’ అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శనకు వెళ్లారు. మోదీ–పుతిన్ ఇలా ఒకే కారులో ప్రయాణించడం ఇది నాలుగోసారి. ప్రోటోకాల్ దాటి చోటుచేసుకున్న ఈ ‘కారు దౌత్యం’.. ఇరుదేశాల నేతల మధ్య ఉన్న సాన్నిహిత్యానికి మరోసారి అద్దం పట్టింది.
వీఐపీలకు ఒకే బస్సు..
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో లూటియన్స్ ఢిల్లీ ప్రాంతాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 15,000కు పైగా అలంకరణ మొక్కలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రధాన కూడళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. 15 వేల మంది పోలీసులు, 200 పారామిలిటరీ కంపెనీలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రగతి మైదాన్ వద్ద చైనా ప్రతినిధులకు వ్యతిరేకంగా నిరసనకు యత్నించిన కొందరు టిబెటన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు సదస్సుకు హాజరయ్యే కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు పార్లమెంట్ నుంచి భారత్ మండపం వరకు ఒకే బస్సులో కలిసి ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు.
కార్యాలయాలకు సెలవు.. రైళ్లు రద్దు
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. సెప్టెంబర్ 11–13 వరకు రాష్ట్రపతి భవన్ మ్యూజియం, అమృత్ ఉద్యాన్, సుప్రీంకోర్టు మెట్రో మ్యూజియాలను మూసివేయడంతో పాటు శనివారం ‘చేంజ్ ఆఫ్ గార్డ్’ వేడుకను రద్దు చేశారు. ఢిల్లీలో పలు లోకల్ రైళ్లను రద్దు చేసి, సుదూర రైళ్లను దారి మళ్లించారు. అయితే, ప్రయాణికులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఆదివారం మెట్రో సేవలను ఉదయం 6 గంటలకే ప్రారంభించనున్నట్లు డీఎంఆర్సీ తెలిపింది.
Also Read : వాహనదారులకు అలర్ట్.. నగరంలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు!
Follow Us On: X(Twitter)

