భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాయుధ పోరాట వారోత్సవాలు

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ​సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ఎర్రజెండా నీడలో శుక్రవారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రజా నాయకుడు రావి నారాయణరెడ్డి స్థూపం వద్ద సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం ఎర్రజెండాను ఆవిష్కరించగా, సాయుధ పోరాట యోధుడు కొమారి రామయ్య విగ్రహానికి సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషాతో పాటు పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

​అనంతరం కొమారి హన్మంతరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాబీర్ పాషా మాట్లాడుతూ, నిజాం నిరంకుశత్వానికి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వెట్టిచాకిరీ విముక్తి, భూమి హక్కు కోసం వేలాది మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం చేశారని, ఈ మహోజ్వల చరిత్రలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల పాత్ర ఇసుమంత కూడా లేదని స్పష్టం చేశారు.

నేడు నయాపైసా త్యాగం చేయని మితవాద శక్తులు చరిత్రను వక్రీకరించి హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. నయా రాచరిక పాలకులపై, ప్రజాస్వామ్య రక్షణ కోసం సమరశీల పోరాటాలు నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. ​ఈ వారోత్సవాల ప్రారంభ సభలో సీపీఐ రాష్ట్ర, జిల్లా నేతలు ముత్యాల విశ్వనాథం, మేయర్ మూడ్ గణేష్, సలిగంటి శ్రీనివాస్, వి. పూర్ణచందర్ రావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>