కలం, నల్లగొండ: బీసీ మహిళల ఆర్థిక పరిపుష్టి, స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని చేపట్టిందని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి. కృష్ణ వంశీ తెలిపారు. నల్లగొండ పట్టణ పరిధిలోని అర్హులైన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అర్హత కలిగిన వారు సెప్టెంబర్ 15వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తుదారులు 18 నుండి 55 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండడంతో పాటు కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షలకు మించొద్దని కృష్ణ వంశీ తెలిపారు. ఫుడ్ సెక్యూరిటీ కార్డు (రేషన్ కార్డు), ఆధార్ కార్డు తప్పనిసరని తెలిపారు. అర్హులైన బీసీ మహిళలు ముందుగా టీఎస్ఓబీఎంఎంఎస్ పోర్టల్ https://tsobmms.cgg.gov.in , https://tsobmms.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఆన్లైన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, దరఖాస్తు కాపీకి సంబంధించిన అన్ని రకాల సర్టిఫికెట్ల (ఆధార్, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం మొదలైనవి) నకళ్లను జతచేసి నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో నేరుగా సమర్పించాలని కమిషనర్ స్పష్టం చేశారు. పట్టణంలోని అర్హులైన బీసీ మహిళలందరూ ఈ పథకాన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు.

