భద్రాచలంలో నకిలీ హాల్‌మార్క్ దందా..!

​కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో అమాయక వినియోగదారులను, ముఖ్యంగా గిరిజన ప్రజలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న నకిలీ హాల్‌మార్క్ (Fake Hallmark) బంగారం దందాపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అధికారులు విరుచుకుపడ్డారు. తక్కువ ధరలకే ఆభరణాలు వస్తున్నాయనే ఆశచూపి నాణ్యత లేని బంగారాన్ని అంటగడుతున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన BIS, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం పట్టణంలోని జ్యువెలరీ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. అధికారుల దాడుల సమాచారం పట్టణమంతటా వేగంగా వ్యాపించడంతో లైసెన్సులు లేని పలువురు వ్యాపారులు తమ దుకాణాలను అప్పటికప్పుడే మూసివేసి పరారయ్యారు.

మరికొందరు యజమానులు అసలు షాపులను తెరవడమే మానేయడంతో స్థానిక వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ​BIS జాయింట్ డైరెక్టర్ టీ.ఆర్. అర్జున్ ఆధ్వర్యంలో సాగిన ఈ తనిఖీల్లో హాల్‌మార్కింగ్ నిబంధనలు పాటించకుండా విక్రయాలు సాగిస్తున్న రెండు ప్రధాన జ్యువెలరీ షాపుల గుట్టు రట్టయింది. సదరు దుకాణాల్లో లైసెన్సులు లేకపోవడమే కాకుండా, 6 అంకెల HUID నంబర్లు కూడా లేని సుమారు 520 గ్రాముల వివిధ రకాల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

ఇందులో ఒక షాపు నుంచి 272.38 గ్రాములు, మరొక షాపు నుంచి 250 గ్రాముల చొప్పున బంగారాన్ని అధికారులు జప్తు చేశారు. గతంలోనే హాల్‌మార్క్ నిబంధనలపై సమావేశం ఏర్పాటు చేసి లైసెన్సులు పొందడానికి తగిన సమయం ఇచ్చినప్పటికీ, ఈ షాపుల నిర్వాహకులు నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ​ఈ సందర్భంగా BIS అధికారులు మాట్లాడుతూ, లైసెన్సులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బంగారం విక్రయించే వ్యాపారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అదే సమయంలో బంగారం కొనుగోలు చేసేటప్పుడు గిరిజనులు, ఇతర వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వినియోగదారులు ముందుగా జ్యువెలరీ షాప్‌కు BIS అనుమతి ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని, బంగారంపై BIS లోగో, నాణ్యత వివరాలతో పాటు 6 అంకెల ఆల్ఫా న్యూమరిక్ HUID నంబర్ ఉందో లేదో ఖచ్చితంగా సరిచూసుకోవాలని స్పష్టం చేశారు. ఆభరణంపై ఉన్న HUID నంబర్‌ను ‘BIS CARE’ మొబైల్ యాప్‌లో నమోదు చేసి వివరాలు నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని, విధిగా పక్కా బిల్లులు తీసుకోవాలని కోరారు. తక్కువ ధరకు వస్తుందని నమ్మి హాల్‌మార్క్ లేని బంగారం కొంటే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతారని అధికారులు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>