కలం, నారాయణపేట: సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రజలకు మరింత భద్రత కల్పించవచ్చని మరికల్ సీఐ (Marikal CI) భగవంత్ రెడ్డి అన్నారు. నర్వ మండలం సీపూర్ (seepur) గ్రామంలో ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నూతనంగా ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామంలోని ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఉండటం వల్ల నేరాలను అరికట్టడంతో పాటు, ఏదైనా ఘటన జరిగినప్పుడు నిందితులను గుర్తించి దర్యాప్తు చేపట్టేందుకు ఫుటేజ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
ప్రజలు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ భద్రతా నిబంధనలు పాటించాలని, గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ చేపడుతున్న చర్యలకు గ్రామస్తులు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో నర్వ ఎస్‌ఐ పబ్బతి రమేష్, సర్పంచ్ చంద్రశేఖర్, గ్రామ పెద్దలు కుర్మారెడ్డి, కురుమూర్తి గౌడ్, రాములు గౌడ్, ఖాజా ఖాన్, సుదర్శన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

