కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ పెద్దచెరువు (Pedda Cheruvu) మినీ ట్యాంక్‌బండ్ అభివృద్ధి పనుల్లో మిగిలిన పనులను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ (Mahabubnagar Collector) ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె పెద్దచెరువు మినీ ట్యాంక్‌బండ్‌తో పాటు సమీపంలోని శిల్పారామాన్ని సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. పెద్దచెరువులో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. ఇరిగేషన్ శాఖ, మూఢ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పెండింగ్ పనుల వివరాలను పరిశీలించారు. అవసరమైన చోట మార్పులు, అదనపు అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. పెండింగ్ పనులన్నింటినీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం శిల్పారామంలోని స్టాళ్లను పరిశీలించిన కలెక్టర్.. వాటి కేటాయింపులు, ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. కేటాయించిన అన్ని స్టాళ్లను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్టోబర్ 1 నుంచి శిల్పారామంలోని అన్ని స్టాళ్లు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

