కలం, నాగార్జునసాగర్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ నంబర్ 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఉద్యోగులు (Polytechnic Employees) శుక్రవారం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగులు, సిబ్బంది కళాశాల ఆవరణలోనే ‘వంటావార్పు’ నిర్వహించి వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు.
జీఓ నం. 97 వల్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ఉనికికే కాకుండా.. అందులో పనిచేస్తున్న ఉద్యోగులు, చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యోగులు, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేలా ప్రభుత్వం తక్షణమే స్పందించి, వివాదాస్పద జీఓ నం. 97ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని, రాబోయే రోజుల్లో దశలవారీగా ఆందోళనా కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

