కలం కరీంనగర్ బ్యూరో: రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్లు మిల్లులను బంద్ చేసి కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. రబీ 2025-26 ధాన్యానికి ఉప్పుడు బియ్యం (పారాబాయిల్డ్) లక్ష్యాన్ని కేటాయించడంతో పాటు ధాన్యం నిల్వ, మిల్లింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు సుధాకర్, శశిధర్‌లు డిమాండ్ చేశారు.
రబీ ధాన్యంలో నూక శాతం తగ్గించి, నాణ్యమైన బియ్యం ఉత్పత్తి సాధించాలంటే శాస్త్రీయ పరీక్షల ఆధారంగా ఉప్పుడు బియ్యం ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. నూకలు, తేమ వల్ల జరిగే నష్టాలను పరిగణనలోకి తీసుకుని బియ్యం నిష్పత్తిని సవరించాలన్నారు. 67 శాతం బియ్యం ఇవ్వలేని మిల్లర్లను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సుమారు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల రబీ ధాన్యం, లక్ష మెట్రిక్ టన్నుల ఖరీఫ్ ధాన్యం లెక్కలు పూర్తయిన తర్వాతే కొత్త ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు.
ఎఫ్‌సీఐ (FCI) గోదాముల్లో తగినంత స్థలం కల్పించి మిల్లుల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని సకాలంలో స్వీకరించాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. వర్షాల వల్ల దెబ్బతిన్న ధాన్యం మిల్లింగ్‌కు డిసెంబర్ వరకు అదనపు గడువు ఇవ్వాలి. గడువు పెంచితే ప్రతి గింజకు బాధ్యత వహిస్తామని స్పష్టం చేశారు. రావాల్సిన మిల్లింగ్, రవాణా, సంరక్షణ రుసుములను వెంటనే చెల్లించి, 25 శాతం జరిమానాను మాఫీ చేయాలన్నారు రైతులు, ప్రభుత్వ రవాణా వ్యవస్థకు తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని చెప్పారు. జిల్లా అధికారులు, మిల్లర్ల ప్రతినిధులతో తక్షణమే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

