కామారెడ్డిలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ ముఠా గుట్టురట్టు

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లాలో అంతర్‌జిల్లా ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ చోరీకి (Transformer Copper Coil Theft) పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా కామారెడ్డి జిల్లాలో 29, మెదక్ జిల్లాలో 23 ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్ కాయిల్స్ చోరీ చేసినట్లు పోలీసులు (Kamareddy Police) గుర్తించారు. మొత్తం 52 ట్రాన్స్‌ఫార్మర్ చోరీలు, ఒక హత్యాయత్నం, రాత్రిపూట ఇంటి దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల నుంచి సుమారు 30 కిలోల కాపర్ వైర్, చోరీలకు ఉపయోగించిన వాహనం, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అభినందించారు.

అసిస్టెంట్ ఇంజనీర్ జాదవ్ బాలాజీ ఫిర్యాదు మేరకు గత ఐదు నెలలుగా భిక్నూర్, బస్వాపూర్, గుర్జకుంట, రామేశ్వరపల్లి, జంగంపల్లి, ర్యాగట్లపల్లి తదితర ప్రాంతాల్లోని 29 ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ కాయిల్స్ చోరీకి గురైనట్లు కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఈ నెల 9న రామేశ్వరపల్లి శివారులో ట్రాన్స్‌ఫార్మర్ చోరీకి ప్రయత్నిస్తున్న దుండగులను అడ్డుకున్న లైన్‌మెన్ ప్రభాకర్‌పై హత్యాయత్నానికి పాల్పడినట్లు కూడా కేసు నమోదైంది. ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో భిక్నూర్ సీఐ జె. నరేష్, సీసీఎస్ సీఐ సంతోష్ కుమార్, భిక్నూర్ ఎస్‌ఐ అనిల్, సీసీఎస్ ఎస్‌ఐ మహేష్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ నెల 11న భిక్నూర్ మండలంలో మరో ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ చోరీకి ప్రయత్నిస్తున్న సమయంలో పరివార్ హోటల్ సమీపంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

నలుగురు అన్నదమ్ములే..

విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠాలోని నలుగురు నిందితులు సొంత అన్నదమ్ములేనని పోలీసులు తెలిపారు. జల్సాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. పగటి వేళల్లో రెక్కీ నిర్వహించి, రాత్రి సమయంలో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ పరికరాలను లక్ష్యంగా చేసుకునేవారని తెలిపారు. చోరీ చేసిన కాపర్ తదితర సామగ్రిని విక్రయించి వచ్చిన డబ్బును జల్సాలకు, బెట్టింగ్‌కు వినియోగించేవారని వెల్లడించారు. నిందితుల్లో కొందరు గతంలోనూ దొంగతనం, రాబరీ కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తమ పద్ధతి మార్చుకోకుండా తిరిగి దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>