శివనామా స్మరణతో మారుమ్రోగిన పురానిపేట ఆంజనేయాలయం

కలం, జగిత్యాల: పట్టణంలోని పురానిపేటలో (Puranipet) కొలువుదీరిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయం శ్రావణమాస చివరి శుక్రవారం సందర్భంగా భక్తిజన సందోహంతో కిటకిటలాడింది. శివనామస్మరణ, లలితాసహస్ర నామ పారాయణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉదయాన్నే సుహాసినిలు తలంటు స్నానాలు ఆచరించి, నూతన వస్త్రాలు ధరించి ఆలయానికి తరలివచ్చారు. ఆలయంలో కొలువుదీరిన మహాశివుడికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో కూడిన పంచామృతాలతో శివలింగానికి అభిషేకం నిర్వహించారు. మహిళలు మంగళహారతులు పట్టి, శివాష్టకం పఠిస్తూ భక్తిని చాటుకున్నారు.

అనంతరం ఆంజనేయస్వామి, పరమశివుడు, లలితా మాత అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, కుంకుమ పూజలు జరిపారు. మహిళలు సమూహంగా లలితా సహస్రనామ పారాయణం చేయగా, ఆలయం మొత్తం భక్తిమయ వాతావరణం నెలకొంది. శ్రావణమాసం ప్రారంభం నుండి నెల రోజులుగా ప్రతిరోజూ సాయంత్రం ఆలయంలో లలితా సహస్రనామ పారాయణం నిర్విరామంగా కొనసాగిందని, చివరి శుక్రవారంతో ఈ పారాయణ దీక్ష పూర్తయిందని ఆలయ సభ్యురాలు చెట్ల జానకి తెలిపారు. శ్రావణమాసంలో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆమె పేర్కొన్నారు.

ఆలయ పూజారి మామిడి రాము భక్తుల గోత్ర నామాధులతో అర్చన చేసి ఆశీర్వధించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రముఖులు నలమాసు గంగాధర్, కొయ్యడ రమేష్, చెట్ల గణేష్, చెట్ల జానకి, చౌడారపు శైలజ, ఆనంతుల సరిత, రాగి రమ్య, దాస సావిత్రి, బట్టు సుజాత తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.

పోచమ్మ ఆలయంలో మున్సిపల్ ఛైర్పర్సన్ పూజలు

జగిత్యాల పురానిపేటలోని లోకమాత పోచమ్మ తల్లి ఆలయంలో జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. లోకమాత పోచమ్మ తల్లి ఆశీస్సులతో పట్టణ ప్రజలు శుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయం పక్షాన ఛైర్పర్సన్ దంపతులను ఘనంగా సన్మానించారు. స్థానిక కౌన్సిలర్ గాజుల లావణ్య మహేష్, ఆలయ కమిటీ సభ్యులు మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>