కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా ఏనుకూరు మండల కేంద్రంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలలో ఏన్కూరు ఆశ్రమ పాఠశాల (Enkoor Ashram School) విద్యార్థులు ‘ఖేల్’ ధమాకా సృష్టించారు. మైదానంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి పతకాల పంట పండించడమే కాకుండా, ఏకంగా 13 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
మండల స్థాయిలో తమ పాఠశాల విద్యార్థులు అండర్-14 వాలీబాల్ విభాగంలో విన్నర్స్‌గా, అండర్-17 వాలీబాల్ విభాగంలో రన్నర్స్‌గా నిలిచి సత్తా చాటారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు బి.రవి, డిప్యూటీ వార్డెన్ డిఎస్. నాగేశ్వరరావు శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని చెప్పారు. క్రీడల్లో విజయం ఒక్కరోజులో రాదని, నిరంతర సాధన, క్రమశిక్షణతోనే విజయ శిఖరాలను అధిరోహించవచ్చని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా స్థాయి పోటీలలోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

